
ప్రజాశక్తి - పాలకొల్లు
స్వాతంత్ర పోరాటంలో బ్రిటీష్ ప్రభుత్వాన్ని సాయుధ పోరాటం ద్వారా తరిమికొట్టిన గోదావరి జిల్లాల తెలుగు బిడ్డ, మన్యం యోధుడు ద్వారబందాల రామచంద్రయ్య నాయుడు జయంతి వేడుక పాలకొల్లు దాసరి కాంస్య విగ్రహ ఆవరణలో శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. జనసేన జిల్లా కార్యదర్శి బోనం వెంకటనరసయ్య, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వంగా నరసింహరావు, బిజెపి పట్టణ అధ్యక్షులు జక్కంపూడి కుమార్, యుకెసి అధ్యక్షులు గాది ఆంజనేయులు, సమితి సలహాదారులు గుగ్గిలపు ముత్యాలరావు పూల మాలలతో ఘనంగా నివాళులర్పించారు. సమితి వ్యవస్థాపక అధ్యక్షులు యర్రంశెట్టి వెంకటరత్నం మాట్లాడుతూ చరిత్ర విస్మరించిన స్వాతంత్య్ర సమరయోధుడు, స్ఫూర్తి ప్రదాత ద్వారబందాల రామచంద్రయ్యనాయుడు 163 సంవత్సరాల క్రితం ఇప్పటి విజయనగరం జిల్లా బొబ్బిలిలో ద్వారాబందాల లక్ష్మయ్యదొర, నర్సమ్మ దంపతులకు జన్మించారని చెప్పారు. రామచంద్రయ్యనాయుడు చదువు కన్నా కుస్తీ పోటీలు, కత్తి, కర్రసాములు, తుపాకీ వేటలో ఆరితేరి తెల్లవారు, వారి పాలెగాళ్లు చేసే అకృత్యాలు, అధికవడ్డీలపై ముఖ్యంగా హరిజన, గిరిజన ప్రాంతాల్లో అనాదిగా వస్తున్న కల్లు, సారాయి మీద కొత్తగా పన్నులు వేసి కట్టని వారిని చిత్రహింసలకు గురిచేస్తుంటే వీరి బాధలు పడలేక వలసలు పోతున్న అడవి బిడ్డలకు అండగా నిలబడి 1877 నుంచి 1879 వరకు ఏడు సార్లు బ్రిటీష్ ప్రభుత్వాన్ని తరిమికొట్టారన్నారు. ఒక సాయుధ దళాన్ని తయారు చేసుకొని బురద కోట స్థావరంగా పోరాట చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బోనం మునసబు, మండెల రజనీ, గుండుమోగుల వీరాస్వామి, యాదంరెడ్డి అప్పాజి, ఉనికెల శ్రీనివాస్, ఇనుకొండ కాశీ, లంకలపల్లి కనకరాజు, మద్దాల ముత్తాజీరావు, ఇనుకొండ శేషాద్రి, పశ్యావుల రవికుమార్, కొల్లి నర్సింహమూర్తి, మండెల పెద్ద, నార్ని మురళీకృష్ణ, మోహన్ పాల్గొన్నారు.