Oct 28,2022 22:56

ప్రతిజ్ఞ చేస్తున్న దంత వైద్య పట్టభద్రులు

286 మందికి దంత వైద్య డిగ్రీల ప్రదానం
21మందికి బంగారు పతకాలు అందజేత
ప్రజాశక్తి -మధురవాడ :
ఎన్‌టిఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న గీతం దంత వైద్య కళాశాల, ఆస్పత్రి ఆధ్వర్యంలో 16వ పట్టభద్రుల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దంత వైద్యవిద్యలో బ్యాచ్‌లర్‌, మాస్టర్‌ డిగ్రీ కోర్సులు పూర్తి చేసుకున్న 286 మంది వైద్య విద్యార్థులకు డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ కార్యవర్గసభ్యుడు, గురుగోవింద్‌సింగ్‌, ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం (న్యూఢిల్లీ) వైస్‌ ఛాన్సలర్‌ పద్మశ్రీ డాక్టర్‌ మహేష్‌వర్మ స్నాతకోత్తర డిగ్రీలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కత్రిమ మేధ, ఐఒటిలతో దంతవైద్యంలో సహితం నూతన ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడుతోందన్నారు. వైద్యవత్తిలో విలువలను కాపాడుకుంటూ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఆరోగ్య సేవలకు పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా ప్రజలకు చేరువ కావడానికి అంకిత భావంతో పనిచేయాలని, పరిశోధనాత్మకంగా నూతన చికిత్స విధానాలను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించిన గీతం అధ్యక్షుడు ఎమ్‌.శ్రీభరత్‌ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో దంత వైద్యానికి ప్రాచుర్యం కల్పించి, తద్వారా అవకాశాలను పెంచుకోవాలన్నారు. వైద్యరంగంలో నూతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధి చెందాలన్నారు. పరిశోధనలపైనే గీతం వైద్యకళాశాల దృష్టి పెట్టిందన్నారు. ఈ సందర్భంగా 21మందికి బంగారు పతకాలను అందజేశారు. గీతం దంత వైద్య కళాశాల ఆస్పత్రి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి. సీతారామరాజు కళాశాల వార్షిక నివేదికను సమర్పిస్తూ, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ జాతీయ ర్యాంకుల పట్టికలో గీతం దంత కళాశాల 33వ స్థానంలో నిలిచిందన్నారు విశాఖ నగర పరిధిలలోని పలు పాఠశాలలను దత్తత స్వీకరించి, విద్యార్థులకు దంతవైద్యసేవలు అందిస్తామన్నారు.
కార్యక్రమంలో రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (బెంగళూరు) దంత వైద్య శాస్త్ర విభాగం డీస్‌ డాక్టర్‌ రబీంద్ర ఎస్‌ నాయక్‌, గీతం విసి ప్రొఫెసర్‌ దయానంద సిద్ధవట్టం, జిమర్‌ ప్రొ వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ బి. గీతాంజలి, కార్యదర్శి ఎమ్‌. భరద్వాజ, దంత కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ప్రభాకరరావు, డాక్టర్‌ రవిశంకర్‌ పాల్గొన్నారు. దంత కళాశాల సహయ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వైఎన్‌. శశిధర్‌ విద్యార్థులతో విలువలతో వైద్య వృత్తిని నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.