
కేక్ కటింగ్ చేసిన మాజీ మంత్రి పాలేటి
ప్రజాశక్తి - చీరాల
మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు తమ మరణ దిన వేడుకలను శనివారం నిర్వహించారు. తాను 1959లో జన్మించానని తెలిపారు. తన తాత 77సంవత్సరాలు, తన తండ్రి 71సంవత్సరాలు జీవించారని తెలిపారు. తాను 75సంవత్సరాలు జీవించగలనని అంచనా వేసుకున్నారు. ఆ ప్రకారం ఇప్పటికి తాను 64సంవత్సరాలు జీవించారనని ఇంకనూ 11సంవత్సరాలు జీవించి ఉండగలనని తెలిపారు. ఆ ప్రకారం తన 11వ మరణ దినోత్సవ వేడుకలను తానే స్థానిక టిడిపి కళ్యాణమండపంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలలో హిందు, ముస్లిం, క్రిస్టియన్ మత బోధకుల మధ్య ఆయన తన డెత్ డే కేకును తానే కట్ చేశారు. పలువురు ఆత్మీయులు డెత్ డే శుభాకాంక్షలు తెలిపారు. తాను బ్రతికి ఉన్న దినములన్ని ప్రేమానురాగాలతో అందరితో ఆత్మీయంగా ఉంటూ ముందుకు సాగాలని అన్నారు. ప్రతి ఏటా తన మరణదిన వేడుకలు నిర్వహిస్తానని అన్నారు. వచ్చే ఏడాది 10వమరణ దిన వేడుకలు జరుపుకోనున్నట్లు తెలిపారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు, బైబిల్ ద్వారా జీసస్, మహమ్మద్ ప్రవక్త, గౌతమ బుద్ధుడు సమాజానికి సూచించిన శాంతి సందేశం ప్రకారం మనిషి జీవించి ఉన్నంత కాలం మాత్రమే బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలు ఉంటాయని అన్నారు. ప్రతి మనిషి తాను ఎంతకాలం జీవించి ఉండగలడో ఒక అంచనాకు రాగలిగితే తోటి వారికి సహాయపడగలిగిన మంచి ఏమి చేయాలనే దాని గురించి ఆలోచిస్తారని అన్నారు. అలాంటి చైతన్యాన్ని కలిగించడం కోసమే తాను మరణ దిన వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఆత్మీయులు అందరికీ తేనేటి విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేశారు. అన్నీ మత గ్రంథాల శాంతి సందేశాలను వినిపించారు.