ప్రజాశక్తి-కొయ్యూరు
స్వాతంత్య్ర సమరయోధుడు, ఆదిమ జాతి నేత మర్రి కామయ్య వర్థంతి కార్యక్రమం మండలంలోని డౌనూరు పంచాయతీ తులబడ గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మర్రి కామయ్య యువజన సంఘం, గిరిజన సంఘం నాయకులు తాంబేలు బంగారమ్మ, తాంబేలు చిట్టిబాబు, శంకర్, గెమ్మెలి సానా, సావిత్రి భవాని తదితరులు మర్రి కామయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు వై.అప్పలనాయుడు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం, అడవి మీద హక్కుల కోసం, భూమి కోసం కామయ్య పోరాటం చేశారని తెలిపారు. కామయ్య ఆశయాలు నెరవేర్చినప్పుడే ఆయనకు నిజమైన నివాళులర్పించినట్లు అని పేర్కొన్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా పివిటిజిలు 2,50,000 మంది ఉన్నారని, వీరంతా అడవిలో పోడు భూమిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. వీరి గ్రామాలకు కనీసం రోడ్డు, మంచినీరు, విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలు లేవన్నారు. నేడు కేంద్ర బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల గురించి పట్టించుకోవడం లేదని, అటవీ హక్కు పత్రాలు ఇవ్వడం లేదని, ఫారెస్ట్ అధికారుల వేధింపులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మర్రి కామయ్య స్ఫూర్తితో పై సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాంబేలు అప్పారావు, సత్తిబాబు, నర్సింగరావు, మల్లేశ్వరం, శైలజ, గిరిజనులు పాల్గొన్నారు.
హుకుంపేట : మండలంలోని తీగల వలస పంచాయితీ కామయ్యపేటలో ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు మర్రి కామయ్య వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా మర్రి కామయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల కార్యదర్శి తాపుల క్రిష్ణారావు, వైస్ ఎంపీపీ కొండలరావు మాట్లాడుతూ,దేశ స్వాతంత్య్రం, గిరిజనుల విముక్తి కోసం తన జీవితాన్ని, ఆస్తిని దారబోసిన మహౌన్నత వ్యక్తి మర్రి కామయ్య అని కొనియాడారు. నూతన అటవీ పాలసీతో గిరిజనులను అడవి నుండి దూరం చేసేందుకు కేంద్రం పూనుకుంటుందని విమర్శించారు.బోయ/వాల్మీకులను ఎస్టీల్లో చేర్చడానికి వైసిపి పూనుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో తీగలవలస మాజీ సర్పంచ్ పల్టాసింగి కామేశ్వరరావు, తడిగిరి వైస్ సర్పంచ్ కిల్లో రామారావు, సీదరి మల్లేష్, శంకర్‌రావు, చిరంజీవి, కొండ పల్లి సూరిబాబు, శెట్టి మత్స్యరాజు పాల్గొన్నారు.
ముంచంగిపుట్టు : గిరిజన సంఘం కార్యాలయంలో మర్రి కామయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె నర్సయ్య నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గిరిజనులను చైతన్యం చేసి స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారన్నారు. బోయ/ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి ఎంఎం శ్రీను, బాషా వాలంటీర్ల సంఘం నాయకులు వి.చంద్రయ్య, కే.కొండయ్య, కే కామేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శి పి.భీ మరాజు పాల్గొన్నారు.
అరకులోయ రూరల్ : అరకులోయలో గిరిజన సంఘం ఆధ్వర్యాన మర్రి కామయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పొద్దు బాలదేవ్, నాయకులు ఆయన విగ్రహాన్ని పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, మర్రి కామయ్య గిరిజన ప్రాంతంలో గిరిజనులను అండగా నిలిచి బ్రిటిష్ నిర్బంధాలను ఎదిరించారన్నారు.గిరిజనుల భూమి, అడవులు గిరిజనులకే దక్కాలని పోరాటం చేశారని అన్నారు. జీవో 3పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేటికీ సుప్రీంకోర్టులో రివ్యు పిటిషన్ వేసి చట్టబద్ధత కల్పించలేదన్నారు. గిరిజన చట్టాలు, హక్కులకు వ్యతిరేకంగా గ్రామసభ అనుమతి లేకుండా హైడ్రో పవర్ ప్రాజెక్టులను నిర్మాణం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. బోయ/ వాల్మికిలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే అసెంబ్లీ తీర్మానం రద్దు చేయాలని ఈనెల 11న అల్లూరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పొద్దు బాలదేవ్, కాపీ రైతుల సంఘం జాతీయ నాయకులు, సుంకరమెట్ట సర్పంచ్ జి చిన్నబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి పోతురాజు, గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్న, నాయకులు కె.రామారావు, గురుమూర్తి పాల్గొన్నారు.










