ప్రజాశక్తి-పాడేరు:పాడేరులో వెలసిన మోదకొండమ్మ అమ్మవారి జయంతి పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. పట్టణంలోని అమ్మవారి భక్తులు ఆలయం వద్ద బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. పాడేరు అరకు శాసనసభ్యులు కె. భాగ్యలక్ష్మి, శెట్టి ఫాల్గుణ అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ మూర్తిని పల్లకిలో ఉంచి పాడేరు పట్టణ వీధుల్లో ఊరేగించారు. అమ్మవార్ల వేషాలు డప్పు వాయిద్యాలతో అమ్మవారి పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కోటగుల్లి సింహాచలం నాయుడు, గౌరవ అధ్యక్షులు తమర్బ నర్సింగ్‌రావు, కొత్తగుల్లి సుబ్బారావు, సర్పంచ్ ఉషారాణి, ఉత్సవ కమిటీ నాయకులు పిన్నయ్యదొర ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.మోద కొండమ్మ జాతర మహౌత్సవాన్ని ఈనెల 14,15,16 తేదీలలో ఘనంగా నిర్వహిస్తున్నామని, జాతరకు రావాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌కు పాడేరు శాసన సభ్యురాలు, ఆలయ కమిటీ అధ్యక్షురాలు కె.భాగ్యలక్ష్మి ప్రత్యేకంగా ఆహ్వానించారు. శుక్రవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ జె.శివ శ్రీనివాసు, అసిస్టెంట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డిఆర్‌ఓ పి.అంబేద్కర్‌లకు ఆహ్వాన పత్రికలను అందజేసి జాతరకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుల్లి సింహచలంనాయుడు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మోదమ్మను దర్శించుకున్న సినీ డైరెక్టర్
గీత గోవిందం. సర్కారు వారి పాట వంటి హిట్ సినిమాల దర్శకుడు పరుశురాం శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి పాడేరులో అమ్మవారి ఆలయాన్ని సందర్శించి మోదకొండమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రతి ఏడాది తాను మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుంటానని ఆయన తెలిపారు. త్వరలోనే తాను రెండు భారీ సినిమాలకు దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రకటించారు కార్తి హీరోగా తాను నిర్మించబోయే ఒక సినిమా అల్లూరి జిల్లాలోనే షూటింగ్ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నామని ఆయన తెలిపారు.










