Feb 18,2023 21:02

శివాలయంలో జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేసిన దృశ్యం

ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
ప్రజాశక్తి - రుద్రవరం

       మండల కేంద్రం రుద్రవరంతో పాటు పలు గ్రామాలలో ప్రజలు శనివారం మహాశివరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రుద్రవరంలోని భాస్కర నందీశ్వర ఆలయంలో ఉదయం నుంచి పూజలు నిర్వహించారు. నల్లమల్ల అడవుల్లో కొలువైన ఒల్లెడ మల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తులు కాలినడకన వెళ్లి మొక్కులను తీర్చుకున్నారు. సంజామల : మండలంలోని నయనాలప్ప క్షేత్రంలో మహాశివరాత్రి పండుగ ఘనంగా జరిగింది. భక్తులు ఉదయం నుంచే పూజలు నిర్వహించారు. మండలంలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కొలిమిగుండ్ల : మండలంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. లలిత సుందరేశ్వర స్వామి, గుండు మల్లేశ్వర స్వామి, కాసుట్ల ఉమామహేశ్వర స్వామి, లక్కగుండ మహేశ్వర స్వామి, కోటపాడు శివాలయంతో పాటు పలు ఆలయాల్లో భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఆళ్లగడ్డ : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని, మండలంలోని శివాలయాలు శివ నామస్మరణతో మారుమ్రోగాయి. వేకువ జామునే భక్తులు శివాలయాలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రంలో శ్రీవల్లి, దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, పరశురామ లింగేశ్వర స్వామికి, పార్వతి దేవి అమ్మవారిని, కాచింతల క్షేత్రంలో కాశీ విశ్వేశ్వరున్ని, అన్నపూర్ణా దేవి అమ్మవార్లను, పట్టణంలోని అమృత లింగేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. శివాలయంలో బ్రహ్మకుమారి సంస్థ వారు భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేశారు.