ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లాలో సోమవారం మే డే ను కార్మిక వర్గాలు ఘనంగా నిర్వహించాయి. సిఐటియు ఆధ్వర్యంలో వాడవాడలా కార్మికులు ఎర్ర జెండా ఎగురవేసి కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అల్లూరి జిల్లా అంతటా ఉదయాన్నే తెల్లారేసరికి జోరు వాన మొదలైంది. అయినప్పటికీ కార్మికులంతా కదిలి వచ్చి తమ తమ ఆవాసాల్లో ఎర్ర జెండా ఎగురవేసి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. జిల్లాలో పలుచోట్ల కార్మికులు ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రం పాడేరులో సీఐటీయూ ఆధ్వర్యంలో గిరిజన సహకార సంస్థ( జిసిసి), గ్రామపంచాయతీ కార్యాలయం, జిల్లా ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, ఆటో స్టాండ్ వద్ద ఆయా రంగాల కార్మికులు ఎర్రజెండా ఎగరవేశారు. సిఐటియు అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో దోపిడీ లేని సమాజం నిర్మాణానికి కార్మిక వర్గాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో మోడీ పాలనలో కార్మిక హక్కులు, చట్టాలను కాల రాస్తున్నారని, దళితులు, గిరిజనులపై దాడులు పెరుగుతున్నాయని అన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా యజమానులకు అనుకూలంగా కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొస్తూ మోడీ ప్రభుత్వం కార్మిక వర్గానికి తీరని ద్రోహం చేస్తోందని విమర్శించారు. ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న కార్మికుల హక్కులు, చట్టాల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయని ఆయన దుయ్య బట్టారు. రాష్ట్రంలో కార్మికులకు ఇచ్చిన హామీని జగన్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిఎం పాదయాత్రలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదన్నారు. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26000 చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాల్లో పని చేస్తున్న స్కీం వర్కర్లలందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, వివిధ కార్మిక కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల నాయకులు శెట్టి నాగరాజు, గౌరీ, వై మంగమ్మ, వంతల దాస్, లక్ష్మణ్, సంజీవరావు, నాయుడు తదితరులు పాల్గొన్నారు.
రంపచోడవరం :మేడే స్ఫూర్తితో కేంద్రంలోని మోడీ ప్రభుత్వ వినాశకర విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు ఎఎస్‌ఆర్ రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్బంగా రంపచోడవరంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మట్ల వాణిశ్రీ, పల్లపు వెంకట్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వెంకట్ మాట్లాడుతూ 1886లో చికాగో నగరంలో కార్మికులు తమ హక్కుల సాధన కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి 8 గంటల పని విధానాన్ని సాధించిన రోజు అని తెలిపారు. కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను నేడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు. కార్మికులను యజమానులకు కట్టుబానిసలను చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్‌ను తీసుకొచ్చిందని తెలిపారు. మరో వైపు ప్రభుత్వ రంగ సంస్థలను అంబాని, అదాని వంటి కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు పూపుకుంటుందని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవటానికి రంపచోడవరం జిల్లాలోనూ ఉద్యమాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి తీగల శ్రీనివాస్, అంగన్వాడీ జిల్లా నాయకురాలు కారం రామలక్ష్మి, మంగమ్మ, సింగారమ్మ, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.










