Oct 08,2022 23:07

ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న మెడికల్‌ రిప్స్‌ యూనియన్‌ నాయకులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ రిప్స్‌ యూనియన్‌ (ఎపిఎంఎస్‌ఆర్‌యు) ఆవిర్భావ దినోత్సవం వేడుకలు శనివారం కెజిహెచ్‌ వద్ద గల యూనియన్‌ కార్యాలయంలో నగర అధ్యక్షులు శేషు కుమార్‌ అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమానికి యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి కెవిపి చంద్రమౌళి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నగర అధ్యక్షులు శేష్‌ కుమార్‌ యూనియన్‌ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మందుల కంపెనీ యాజమాన్యాలకు అనుకూలంగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల మొత్తం మెడికల్‌ రిప్స్‌ ఉద్యోగ భద్రత కోల్పోయారని తెలిపారు. ఈ మధ్య కాలంలోనే వేలాది మంది ఎంఆర్‌లు ఉద్యోగం కోల్పోయి వీధిన పడ్డారన్నారు. అన్ని మందుల కంపెనీ యాజమాన్యాలు కార్మిక చట్టాలు అమలు చేయకుండా ఎంఆర్‌ల సర్వీస్‌ కండిషన్లపై అడ్డగోలుగా దాడులు చేస్తున్నాయన్నారు. కావున సమస్యల పరిష్కారానికి పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు.
రాష్ట్ర కార్యదర్శి కెవిపి చంద్రమౌళి మాట్లాడుతూ, 1963లో యూనియన్‌ ఆవిర్భవించిన నాటి నుంచి పోరాడి సాధించుకున్న చట్టాలను, సర్వీసు కండిషన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్య అనుకూల హైర్‌ అండ్‌ ఫైర్‌ పాలసీల కారణంగా అన్ని యాజమాన్యాలు తుంగలో తొక్కుతున్నాయన్నారు. దీని వల్ల ఈ రంగంలో పనిచేస్తున్న లక్షల మంది ఎంఆర్‌లు ఉపాది కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. కరోనా కాలంలో, కరోనా అనంతర కాలంలో అనేక దేశీ,బహుళ జాతి కంపెనీల యాజమాన్యాలు వేల సంఖ్యలో ఎంఆర్‌ లను ఉద్యోగాల నుంచి తొలగించాయన్నారు. ఈ చర్యలను చాలెంజ్‌ చేస్తూ యూనియన్‌ కార్మిక వివాదాల కోర్టులలో కేసులు వేసి పోరాడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబరు 21న దేశ వ్యాప్తంగా వేలాది మంది ఎంఆర్‌లతో 'చలో ఢిల్లీ' (పార్లమెంటు వద్ద నిరసన) కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా వందల మంది హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంజయ కుమార్‌, నగర కార్యదర్శి డి.స్రవంత్‌ మెడికల్‌ రిప్స్‌ హాజరయ్యారు.