అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని పలు చోట్ల మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాతృభాష ఆవశ్యకత, తెలుగు భాష గొప్పతనం గురించి పలువురు ప్రసంగించారు.
ప్రజాశక్తి- సబ్బవరం
అంతర్జాతీయ మాతభాషా దినోత్సవం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు సిహెచ్. చిన్నమ్మాయి అధ్యక్షతన మంగళవారం ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మండల విద్యా శాఖాధికారి ఎస్.అప్పలరాజు మాట్లాడుతూ అమ్మ ఒడి నుండి మొదట నేర్చుకొనే భాష మాతృ భాష అని, మనస్సులోని భావాలను సహజంగా వ్యక్తం చేయగల శక్తి మాతృభాషలోనే ఉందని తెలిపారు. నేడు మాతృభాషను నిర్లక్ష్యం చేస్తూ పరభాషల వెంట పరుగులు తీస్తున్నారన్నారు. ఇతర భాషలను నేర్చుకోవడం అవసరమే, కానీ ఆ నెపంతో మాతృభాషను చిన్న చూపు చూడరాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు డి.రాంప్రసాద్, సిహెచ్.కుమార్ ప్రకాష్, నాగమణి, పిడి రెహమాన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అనకాపల్లి : తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి తెలుగువానిపై ఉందని సిద్ధార్థ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బల్ల నాగభూషణం అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మంగళవారం వన్ వే ట్రాఫిక్ జంక్షన్‌లో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాదచారులకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు విన్నకోట నీలేష్ గుప్తా, వి.సత్యనారాయణ, ఆర్ మల్లేశ్వరరావు, పి కష్ణమోహన్, పిరాట్ల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
వడ్డాది : తెలుగు భాష అమ్మలాంటిదని అతిథి దేవోభవ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఆరిపాక కామేశ్వరరావు తెలిపారు. బుచ్చయ్యపేట మండలం వడ్డాది మెయిన్ స్కూల్లో మంగళవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లలకు తెలుగు భాష పై వివిధ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. తెలుగు భాషలో ఉన్న గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టీవీ శేషగిరిరావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తకోట : రావికమతం మండలం టి. అర్జాపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మాతృభాషా దినోత్సవం సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం కెఆర్‌ఎస్ నాయుడు ఆధ్వర్యంలో తెలుగుతల్లి చిత్రపటానికి పూలంకరణ చేసి జోహారు ్లఅర్పించారు. ఈ సందర్బంగా సిఆర్‌పి గుంటూరు రామారావు మాట్లాడుతూ. తేనెలొలుకు తెలుగుభాష పరిరక్షణకు అందరం కట్టుబడి ఉందామని కోరారు. ఈ సందర్భంగా మాతృభాష ఆవశ్యకతపై విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయినులు వరహాలమ్మ, త్రివేణి పాల్గొన్నారు..
మాడుగుల : మనోవికాసానికి మాతృభాష ఎంతో అవసరమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ జయలక్ష్మి అన్నారు. మంగళవారం కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులు మాతృభాష తెలుగుపై మక్కువ, ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు. తెలుగు విభాగాధిపతి వులపర్తి పైడిరాజు మాట్లాడుతూ మాతృభాష సాహిత్యాలను అధ్యయనం చేయడం ద్వారా హదయోల్లాసం కలుగుతుందన్నారు కార్యక్రమంలో అధ్యాపకులు షర్మిల, డాక్టర్ రమణ మూర్తి, రాజు, నారాయణ, సులోచన, రామకుమార్ బోధనేతర సిబ్బంది సులేమాన్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పెందుర్తి: స్థానిక ఆదర్శ్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ టి.తీయోపిల్లస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథి డాక్టర్ బి.సుబ్బయ్య మాట్లాడుతూ, భాష యొక్క విలువలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎన్‌ఇ.ఫ్లోరా, వైస్ ప్రిన్సిపల్ బాల్బన్, ఎఒ రవిబాబు, ఎన్‌ఎస్‌ఎస్ పిఒలు మంజుల, గౌతంబాబు, అచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.
గుండెలనిండా తెలుగు నిండి ఉండాలి
ఎంవిపి.కాలనీ : ఆంధ్రవిశ్వవిద్యాలయం టిఎల్‌ఎన్ సభామందిరంలో ఆంధ్రవిశ్వవిద్యాలయం తెలుగు విభాగం, సమైక్య భారతి సంయుక్తంగా 'అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం-తెలుగు ప్రాశస్త్యం' సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏయూ ఉపకులపతి ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి మాట్లాడారు. మన గుండెల నిండా తెలుగు నిండి ఉండాలన్నారు. భవిష్యత్ తరానికి భాషను అందించే బాధ్యత యువతపై ఉందన్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు శలాక రఘునాథశర్మ మాట్లాడుతూ, తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తూ పరభాషల అవసరాన్ని వివరించారు. ప్యారిస్ నుంచి వచ్చిన తెలుగు భాషాభిమాని డేనియల్ నేజర్స్ దేవదేవ మహాదేవ శ్లోకంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎ.నరసింహారావు, సమైక్య భారతి జాతీయ గౌరవాధ్యక్షులు మూర్తి రేమెళ్ల, తెలుగు విభాగాధిపతి ఆచార్య జర్రా అప్పారావు, ఆచార్య వెలమల సిమ్మన్న, ఆచార్య కె.శ్రీనివాస్, సాలూరు వాసూరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సు ప్రత్యేక సంచికను వీసీ ప్రసాదరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం అతిథులను వర్సిటీ తరపున సత్కరించారు.










