Sep 07,2023 22:29

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
          శ్రీకృష్ణుడి గీతాసారం అనుసరణీయమని ఉపముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గురువారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక 23వ వార్డులో అభివృద్ధి పనులతో ఆధునీకరించిన శ్రీకృష్ణుడు చెరువును మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. స్థానిక 6-11 వార్డులు కూడలి ప్రాంతమైన టిటిడి కళ్యాణ మండపం వద్ద మినీ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. 33 ఏళ్లుగా తాత్కాలికంగా పందిరి వేసి శ్రీ కృష్ణాష్టమి వేడుకలు చేస్తున్న టిటిడి కళ్యాణ మండపం వద్ద శాశ్వత ప్రాతిపదికన కృష్ణుడి మందిరం నిర్మించుకునేందుకు వంద గజాల స్థలం కేటాయించడంతోపాటు, రూ.10 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అనంరతం కృష్ణుడు చెరువు వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మంత్రి కొట్టు కొంతసేపు వడ్డన చేశారు. కోలాటం ప్రదర్శిస్తున్న చిన్నారులను అభినందించారు. టిటిడి కళ్యాణ మండపం వద్ద వేద పాఠశాల విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో వైసిపి యువ నాయకులు కొట్టు విశాల్‌, వార్డు ఇన్‌ఛార్జిలు, మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ అనపర్తి శామ్యూల్‌ పాల్గొన్నారు.
పాలకొల్లు :అహంతో కాకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తే విజయం సాధిస్తామని టిటిడి పాలకవర్గ సభ్యులు మేకా శేషుబాబు అన్నారు. పాలకొల్లు మాంటిస్సోరి స్కూల్‌, జూనియర్‌ కళాశాలలో గురువారం నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శేషుబాబు సతీమణి శశికళ జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీకృష్ణునికి పుష్పమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రదర్శనలు తిలకించారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించగా, వారు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. ఉట్టి కొట్టే సన్నివేశాలు తల్లిదండ్రులను, అతిథులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ కెవి.కృష్ణవర్మ, ప్రిన్సిపల్‌ ప్రకాష్‌రావు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
పెనుమంట్ర : కృష్ణాష్టమి వేడుకలను మార్టేరు వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఆ ప్రాంతంలోని చిన్నారులంతా కృష్ణుడి వేషంలో నృత్యం చేస్తూ చుట్టుపక్కల వారిని అలరించారు. ప్రతి గ్రామంలోని వీధుల్లో వేడుకలు నిర్వహించారు. కొన్నిరోజుల నుంచి పిల్లలు సేకరించిన చందాలతో చిన్న కుండీలో పెరుగు, వెన్నతో కలిపి ఉట్టిగా తయారు చేశారు.