ప్రజాశక్తి - ముదినేపల్లి
క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కొన్ని చర్చిల్లో శనివారం రాత్రి పది గంటల నుంచి అర్థరాత్రి రెండు గంటల వరకూ వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకూ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, యువకులు, చిన్నలు, పెద్దలతో చర్చిలు కిటకిటలాడాయి. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేశారు. మండలంలోని వణుదుర్రు ఆర్‌సిఎంలో జరిగిన వేడుకల్లో ఎంఎల్‌ఎ తనయులు దూలం వినరుకుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు. చినపాలపర్రులోని పెంతెకొస్తు చర్చిలో టిడిపి యువనేత కొడాలి వినోద్ కేక్‌కట్ చేశారు. పేదలకు వస్త్రాలు, పండ్లు ఫలహారాలు అందజేశారు. ముదినేపల్లిలోని ఎల్‌ఇఎఫ్, ఆర్‌సిఎం, క్రీస్తు సంఘం పెంతెకొస్తు, సిబిసిఎన్‌సి, సాల్వేషన్ ఆర్మీ తదితర చర్చిల్లో క్రీస్తు జననం నాటికలు ప్రదర్శించారు. ఆయా వేడుకల్లో ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ, వైసిపి నాయకులు బొర్రా శేషుబాబు, సాక్షి సాయి, కుమార్, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
టి.నరసాపురం : క్రిస్మస్ వేడుకలు మండలంలో ఘనంగా నిర్వహించారు. ప్రకాష్‌నగర్‌లోని షాలేము సహవాస ప్రార్థనా మందిరంలో మండల యునైటెడ్ పాస్టర్ల అసోషియేషన్ సంఘ అధ్యక్షులు జి.జ్ఞానరాజు కేక్ కట్ చేశారు. మర్రిగూడెం, మక్కినవారిగూడెం, టి.నరసాపురం, పుట్రేపు తదితర గ్రామాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వృద్ధులకు, వితంతువులకు వస్త్రాలు పంపిణీ చేశారు. చిన్నారులు ప్రత్యేక నృత్యాలతో అలరించారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుని స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీస్తు బోధనలు అనుసరణీయమన్నారు. ఆయా కార్యక్రమాల్లో పాస్టర్లు కె.నిరీక్షణరావు, సిహెచ్.హోషేయ, టి.ప్రసన్న కుమార్, డి.ప్రసన్న రాజు, సిహెచ్.రమేష్, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.
కైకలూరు రూరల్ : క్రీస్తు బోధనలు అనుసరణీయమని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని భుజబలపట్నం లుక్ మెమోరియల్ బాప్టిస్టు ఆలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన ప్రేమ, దయ, కరుణ, త్యాగం క్రీస్తు బోధనల్లోని ప్రధాన అంశాలని, ప్రతిఒక్కరూ వీటిని తప్పక అనుసరించాలని సూచించారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దలు ముసునూరి సీతారామరాజు, క్రైస్తవ పెద్దలు పాల్గొన్నారు.
ఏలూరు అర్బన్ : ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు బిషప్ హౌస్‌లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. బిషప్ పొలిమేర జయరావు వీరికి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం శాంతినగర్‌లోని మన్న చర్చికి వెళ్లి ఏలీషా రాజు, జ్యోతి రాజు ఆశీస్సులు పొంది శుభాకాంక్షలు తెలిపి, క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు.
చర్చిలు కళకళ
క్రిస్మస్ పండుగ సందర్భంగా నగరంలోని చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక బాలయోగి వంతెన సమీపంలోని ఇశ్రాయేలు పేటలో సెయింట్ జాన్స్ ఆర్‌సిఎం చర్చిలో ఏలూరు కతొలికా పీఠం బిషప్ జయరావు పొలిమేర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పెరికే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవసా ్థపకులు పెరికే వరప్రసాద్ వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. పెరికే ప్రసాద్ దంపతులు బిషప్‌ను ఘనంగా సన్మానించారు.
ముసునూరు : ప్రేమ, కరుణ, దయ, స్నేహం ప్రతి ఒక్కరూ అలవర్చుకుని ఏసుక్రీస్తు మాదిరి అందరి మన్ననలు పొందాలని జెడ్‌పిటిసి సభ్యులు వరికూటి ప్రతాప్ అన్నారు. మండలంలోని లోపూడిలోని చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని 16 గ్రామాల్లో ఆయా చర్చిల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఆగిరిపల్లి : క్రిస్మస్ వేడుకలు మండలంలోని చర్చిల్లో ఘనంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కనసానపల్లి పరిశుద్ధ పౌల్ సిఎస్‌ఐ చర్చిలో పాస్టర్లు కె.ఐజక్‌జాన్, సిహెచ్.శశిధర్, కొల్లూరి మార్క్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
జంగారెడ్డిగూడెం : మండలంలోని తాడువాయి పంచాయతీ చల్లవారిగూడెం ఆర్‌అండ్‌అర్ కాలనీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిర్వాసిత కాలనీలో వేలేరుపాడు మండలం శ్రీరామపురం కాలనీ వాసులు రేవరెంట్ బాబూరావు సమక్షంలో ప్రార్థనా గీతాలు ఆలపించారు. అలాగే 10 కిలోల కేక్ కట్ చేసి పిల్లలకు పంచారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు జి.వెంకటేశ్వర్లు, పి.నరసింహారావు, బద్దె ప్రేమ్‌కుమార్, సుందర్‌రావు, సుధాకర్, డాన్ శ్రీను పాల్గొన్నారు.










