Dec 24,2022 23:21

అయ్యన్న స్కూల్‌లో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న చిన్నారులు

ప్రజాశక్తి-అనకాపల్లి
స్థానిక డైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల విద్యార్థులు క్రిస్మస్‌ ట్రీ, క్రీస్తు జననాన్ని వివరించేల రూపొందించిన కళాకృతులు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా క్రైస్తవ గీతాలను విద్యార్థులు ఆలపించారు. కళాశాల కరస్పాండెంట్‌ దాడి రత్నాకర్‌ కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వైకుంఠరావు, డీన్‌ అడ్మిన్‌ డాక్టర్‌ కెఎస్‌ ఈశ్వరరావు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
అయ్యన్న ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో..
కె.కోటపాడు : స్థానిక అయ్యన్న ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో శనివారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రీస్తు జననం తెలిపే పశువుల పాక, దానిలో బొమ్మలు చూపరులను ఆకట్టుకున్నాయి. విద్యుత్‌ లైట్లతో క్రిస్మస్‌ ట్రీ ఎంతగానో కనువిందు చేసింది. క్రిస్మస్‌ తాతలు వేషధారణలో పలువురు చిన్నారులు ప్రాంగణమంతా సందడి చేశారు. దేవదూతల వస్త్రధారణల్లో చిన్నారులు ఏసుక్రీస్తు పాటలకు అనుగుణంగా చేసిన నృత్య ప్రదర్శనలు, జ్ఞానులు, గొర్రెల కాపర్లు వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా అయ్యన్న విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ ఖాశీం చిన్నారులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. అంతరం తల్లిదండ్రుల సమక్షంలో క్రిస్మస్‌ కేక్‌ను కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ హరీష, ఉపాధ్యాయులు సతీష్‌ సమర్పణ, డేవిడ్‌, శ్రావణి, పద్మిని, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చర్చలు ముస్తాబు
కశింకోట : ఆదివారం క్రిస్మస్‌ వేడుకల నేపథ్యంలో మండలంలోని కశింకోట, తాళ్ళపాలెం, కన్నూరుపాలెం, నరిశింగబిల్లి, బయ్యవరం, కొత్తపల్లి తదితర గ్రామాల్లో చర్చలు ముస్తాబయ్యాయి. ఆయా చర్చ పాస్టర్లు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ రకాల సేవలు, ప్రార్థన, భోజనం సదుపాయం, గేయాల ఆలపించేందుకు సిద్ధం చేశారు. చర్చలు రంగులు, ప్రత్యేక విద్యుత్‌ దీపాలతో అలంకరణ చేశారు.