ప్రజాశక్తి - ఏలూరు
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందించడమే లక్ష్యంగా, ప్రణాళికబద్ధంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు ఆధ్వర్యంలో ఆర్‌ఆర్.పేట శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ వేద పండితులు యనమండ్ర రవిప్రకాష్ కలెక్టర్‌ను ఆశీర్వదించి శ్రీవారి ప్రసాదం, హనుమాన్ జంక్షన్ శ్రీ అభయ ఆంజనేయస్వామి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జెసి పి.అరుణ్‌బాబు, డిఆర్‌ఒ మూర్తి, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛందసేవా సంస్థల ప్రతినిధులు, అధికారులు తరలివచ్చి కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. జిల్లాలో అన్నిరంగాలను అభివృద్ధి పథంలో నడిపించడానికి సమిష్టి కృషి ఎంతో అవసరమన్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, వాటిని మరింత ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లా అభివృద్ధిలో అన్ని విధాలా పాలుపంచుకుంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ సిబ్బంది, జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఏడాది అన్ని వర్గాల ప్రజలకు చేపట్టే ప్రతి పనిలో విజయాలు సిద్ధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒలు కె.పెంచల కిషోర్, డాక్టర్ ఝాన్సీరాణి, కలెక్టరేట్ ఎఒ రమాదేవి, జెడ్‌పి సిఇఒ కె.రవికుమార్, డిపిఒ మల్లికార్జున్, వ్యవసాయశాఖ జెడి వై.రామకృష్ణ తదితర జిల్లా అధికారులు కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఏలూరు రేంజ్ డిఐజి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ డిఐజి జి.పాలరాజును మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పాలరాజుకు ఉద్యోగోన్నతి పొందడం పట్ల అభినందనలు తెలిపారు.
ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జెసి పి.అరుణ్‌బాబును మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు నగర అభివృద్ధికి జిల్లా యంత్రాంగం తమ పాలకవర్గానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని మేయర్ నూర్జహాన్, కో-ఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్.పెదబాబు కోరారు. ఈ సందర్భంగా మేయర్ దంపతులకు కలెక్టర్, జెసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విజుబుల్ శానిటేషన్ లక్ష్యంగా ఏలూరు నగరాన్ని పరిశుభ్రతతో కూడిన ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు తమ పూర్తి సహకారం అందిస్తామన్నారు.
నూతన సంవత్సర వేడుకలు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల అధికారి ఆర్‌విఎస్.రామచంద్రరావు, డివిజనల్ పౌర సంబంధాల అధికారి దుర్గాప్రసాద్, సిబ్బంది సమక్షంలో నూతన సంవత్సర కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌విఎస్.రామచంద్రరావు మాట్లాడుతూ 2022 సంవత్సరంలో అధికారులు, సిబ్బంది ద్వారా నిర్వహించిన శాఖపరమైన విధులు మంచి స్ఫూర్తితో నిర్వహించారని, అదే స్ఫూర్తితో సిబ్బంది అందరూ 2023లో కూడా శాఖాపరమైన విధులు నిర్వహించాలన్నారు. అనంతరం డివిజనల్ పిఆర్‌ఒ వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఆడియో విజువల్ సూపర్‌వైజర్ సిహెచ్.రాంబాబు, ఎఐఇ ధనుంజయరావు, టైపిస్టు డి.శౌరిప్రసాద్, రికార్డు అసిస్టెంట్ బాబూరావు, ఫొటోగ్రాఫర్ పి.సాగర్, ప్రభాకర్ రావు, వీరభద్రం పాల్గొన్నారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్‌పి రాహుల్ దేవ్ శర్మ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో శాంతి భధ్రతల పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న ఎస్‌పికి ఉద్యోగోన్నతి లభించడం పట్ల కలెక్టర్‌కు శర్మకు అభినందనలు తెలిపారు.
నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ బివి.కృష్ణారెడ్డి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, ముఖ్యంగా తలసేమియా చిన్నారులకు రక్తదాన శిబిరాలు నిర్వహించడం, జిల్లాలో ఉన్న గిరిజన ప్రాంతాల్లోని ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాలని కృష్ణారెడ్డికి సూచించారు.










