Oct 22,2023 21:40

భామిని కీర్తిరాయి నవీన్‌చంద్రదొరను ఊరేగిస్తున్న గ్రామస్తులు

ప్రజాశక్తి - కురుపాం : మండలంలోని జి.శివడ పంచాయతీలో గల కోటకొండ గిరి శిఖర గిరిజన గ్రామంలో వెలిసిన కోటకొండ దుర్గమ్మను ప్రతి ఏటా దసరాకు మూడు రోజులు ముందుగా భామిని, కురుపాం మండలాల నుంచి పెద్దసంఖ్యలో దుర్గమ్మను దర్శించుకుంటారు. ఈ దుర్గమ్మను దర్శించుకోవాలంటే జి.శివడ నుండి సుమారు 8కిలోమీటర్ల దూరం కొండ ఎక్కి దర్శించుకోవాలి. కోటకొండ దుర్గమ్మకు దసరాకు మూడు రోజులు ముందుగా పడినటువంటి ఆదివారము నాడు దర్శించుకుంటారు. ఈ దుర్గమ్మ దసరా నవరాత్రులు పూజలను అందుకుంటుంది. ఆదివారం ఉదయం నుండి ఈ రెండు మండలాల నుండి భక్తులు తండోపతండాలుగా వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు.
భామిని : పర్లాకిమిడి రాజులచే మోకాశ దొరలుగా గతంలో పిలువబడిన భామిని గ్రామ కీర్తి రాయి వంశస్తులు ప్రతి ఏటా విజయదశమి ముందుగా వచ్చే ఆదివారం దసరా పండుగ నిర్వహిస్తారు. కీర్తిరాయి వంశస్తులు స్వతహాగా గిరిజన వంశస్తులు కావడంతో గిరిజన సంప్రదాయాలతో కీర్తిరాయి వంశస్తులు కుల దైవమైన కోటకొండ దుర్గమ్మ వెలసిన స్థలానికి వెళ్లి ఆదివారం మొక్కులు చెల్లిస్తారు. కార్యక్రమం లో భాగంగా ఈ ఏడాది కీర్తి రాయి క్రిష్ణ చంద్రదొర కుమారుడు నవీన్‌ చంద్రదొర శనివారం గ్రామస్తులు, గిరిజన కుటుంబాలతో కలిసి డప్పు వాయుద్యాలతో వంశధార నదికి వెళ్లి ఆయుధాలు శుభ్రం చేసి, ఇంటి వద్ద వున్న పూజమందిరం వాటిని అలకరించి పూజలు నిర్వహించారు. ఆదివారం నవీన్‌ చంద్ర దొర గిరిజన దొర వేషధారణలో డప్పు వాయుద్యాల మధ్య ఊరేగింపుగా గుర్రం పై వెళ్లి దుర్గమ్మకు మొక్కులు చెల్లించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తులు పత్తిరి కొమ్మలను దొర పూజ కార్యక్రమంలో ఉంచి, వాటిని వ్యవసాయం పొలంలో జల్లితే పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్మకం. ఈ దసరా ఉత్సవాలను తిలకించడానికి వచ్చిన పరిసర గ్రామ ప్రజలతోకిట కిట లాడింది.
ఘటాలు ఊరేగింపు
గుమ్మలక్ష్మీపురం : ప్రతి ఏటా దసరా పండుగ సందర్భంగా గుమ్మలక్ష్మీపురం నుంచి మాలతమ్మతల్లి గుడి వరకు భక్తులు 15 కిలోమీటర్లు ఘటాలు ఊరేగింపుగా వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే ఆదివారం ఉదయం గుమ్మలక్ష్మీపురం నుంచి మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాలజంగడి, ఘటాలను మాలతమ్మ గుడి వరకు ఊరేగించారు. కార్యక్రమంలో సర్పంచి బి.గౌరీశంకర్రావు, దోస్త్‌ మేరా దోస్త్‌ సభ్యులు పాల్గొన్నారు.
మాలతమ్మ గుడి దసరా ఏర్పాట్లు పరిశీలన
కురుపాం : మండలంలోని నేరేడువలస గల మాలతమ్మ గుడి వద్ద జరగనున్న విజయదశమి వేడుకల ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం ఎల్విన్‌పేట సిఐ సత్యనారాయణ పరిశీలించారు. క్యూలైన్లు, పార్కింగ్‌ ప్రదేశాలు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం స్వచ్చంధంగా సేవ చేస్తున్న యువతకు భక్తుల రద్దీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు సలహాలు అందించారు. కార్యక్రమంలో స్థానిక ఎస్సై సిహెచ్‌ ప్రసాద్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు .