Oct 03,2023 00:18

వడ్లపూడిలో మాట్లాడుతున్న వైటి.దాస్‌

ప్రజాశక్తి -యంత్రాంగం
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు.
ఉక్కునగరం :
పాత వడ్లపూడి అంబేద్కర్‌ విగ్రహం వద్ద కెవిపిఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. కెవిపిఎస్‌ విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎం సుబ్బన్న అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ స్టీల్‌ జోన్‌ నాయకులు వైటి.దాస్‌ మాట్లాడుతూ, పోరాటాలు, విజయాలను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో దళితుల అభివృద్ధికి మరెన్నో ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. మనువాద మతోన్మాదాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేద్దామన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, ప్రభుత్వ రంగ సంస్థలు, వాటిలోని రిజర్వేషన్లు, ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టాలను, సబ్‌ ప్లాన్‌లను కాపాడుకోవాలన్నారు. కెవిపిఎస్‌ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుకోటి చిరంజీవి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సైకిల్‌ చైతన్య యాత్రలు జరిపి 60 రకాల కుల వివక్ష రూపాలను బహిష్కృతం చేసినట్లు వివరించారు. అంటరానితనం, కుల వివక్షతను వ్యతిరేకించే వారందరిని సమైక్యపరిచి మానవహారాలు, పాదయాత్రలు నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో నూకరాజు, పుష్ప, కుమారి, గంగమ్మ, లక్ష్మి, దేవి, పద్మ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ములగాడ : 63వ వార్డు పరిధి చింతల్లోవలో కెవిపిఎస్‌ జెండాను సంఘం మల్కాపురంజోన్‌ కార్యదర్శి కొత్తలంక పెంటారావు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాటి గాంధీ ఆశయాలను, రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ నేటి పాలకులు దళిత, గిరిజన, మైనార్టీ, వెనుకబడిన తరగతుల కులావారిపై దాడులు, హింసలకు ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. మహాత్మా గాంధీ ఆశయాసాధనలో నడిచినప్పుడే దేశానికి మనుగడ, ఖ్యాతి ఉంటుదన్నారు ఈ కార్యక్రమంలో పి.రామారావు, నీలయ్య, హరి, సత్తిబాబు, పైడిరాజు, రాహుల్‌ తదితర్లు పాల్గొన్నారు.
భీమునిపట్నం : స్థానిక ఎఎంసి కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్‌ కాలనీలో సోమవారం కెవిపిఎస్‌ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ముందుగా డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగం లక్ష్మి, సభ్యులు ఎం శివ తదితరులు పాల్గొన్నారు.