ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్ : జిల్లా స్థాయి యువజనోత్సవాలు జట్టు ఆశ్రమంలో సోమవారం ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సృజనాత్మకత పెంపొందించుకోవాలన్నారు. యువతలో ఎంతో సృజనాత్మకత, నైపుణ్యాలున్నాయని వాటికి సరైన విధానంలో పదునుపెడితే భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని తెలిపారు. కష్ట పడితే సాధ్యం కానిదేదీ లేదని ఆయన అన్నారు. విద్యతోపాటు లలిత కళలలో పరిచయం, ప్రవేశం లేదా నిపుణత సాధించడం ఎంతో ఆత్మ సంతృప్తిని, మానసిక స్థైర్యాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. సెట్విజ్ సిఇఒ బి.రామగోపాల్ మాట్లాడుతూ యువజనోత్సవాలలో భాగంగా సాంస్కృతిక విభాగంలో జానపద నృత్యాలు (సోలో, బృందం), జానపద గీతాలు (సోలో, బృందం), జీవిత నైపుణ్య విభాగంలో స్టోరీ రైటింగ్ (సోలో), పోస్టర్ మేకింగ్ (సోలో), డిక్లమేషన్ (సోలో), ఫోటోగ్రఫీ (సోలో), వన్ మినిట్ - పర్యావరణ పరిరక్షణపై (సోలో), ఆరోగ్యం, శరీర ధృడత్వం విభాగం లో యోగా ప్రదర్శన (బృందం)పై పోటీలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో ప్రధమ స్థానం సాధించిన వారు రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో, రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన వారు జాతీయస్థాయి యువజనోత్సవాల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, నెహ్రూ యువ కేంద్ర జిల్లా సమన్వయ అధికారి కె.వెంకటఉజ్వల్, పర్యాటక అధికారి ఎన్.నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు..










