ప్రజాశక్తి- అనకాపల్లి
రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి యువజనోత్సవాలు శుక్రవారం స్థానిక మున్సిపల్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. జిల్లాలోని పలు హైస్కూళ్లు, కళాశాలల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. వక్తృత్వ, కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు, హార్మోనియం, మిమిక్రీ, ఫ్యాన్సీ డ్రెస్, ఆధునిక గీతం, ఆధునిక నృత్యం, క్వీజ్, పెయింటింగ్, గ్రూపు డిస్కసన్ వంటి 13 ఈవెంట్స్ ప్రదర్శించారు. ఈ ఉత్సవాలను ప్రారంభించిన స్థానిక ఎంపీ డాక్టర్ బివి.సత్యవతి మాట్లాడుతూ నేటి యువత ఎంతో మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారని, వీటిని అధిగమించేందుకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆమె తిలకించారు. కార్యక్రమంలో సెట్విస్ సీఈవో నాగేశ్వరరావు, డిపిఆర్‌ఓ సాయిబాబా, నెహ్రూ యువ కేంద్రం కో-ఆర్డినేటర్ మహేష్, జిల్లా క్రీడల శాఖ అధికారి సూర్యనారాయణ, వైసిపి నాయకులు ఆళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










