ప్రజాశక్తి - కాకినాడ
జెఎన్‌టియుకె అలూమినీ ఆడిటోరియంలో విశ్వవిద్యాలయ 15వ వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విసి జివిఆర్.ప్రసాదరాజు అధ్యక్షత వహించారు. ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ విసి కె.పద్మరాజు, మాజీ విసిలు విఎస్‌ఎస్.కుమార్, ఎం.రామలింగరాజు, రెక్టార్ కెవి.రమణ, రిజిస్ట్రార్ ఎల్.సుమలత, ఒఎస్‌డి డి.కోటేశ్వరరావులు అతిథులుగా హాజరయ్యారు. యుసిఐకె పూర్వ విద్యార్థి, తూర్పుగోదావరి జిల్లా సబ్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని సాంకేతిక విద్యకు జెఎన్‌టియుకె, జెఎన్‌టియుఎ విశ్వవిద్యాలయాలు మూలస్తంభాలుగా నిలుస్తున్నాయన్నారు. ప్రస్తుత కాలంలో సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యారంగం, పరిశ్రమల మధ్య అంతరాన్ని పూరించాలన్నారు. అన్ని వనరులను వినియోగించుకునేలా విద్యార్థులను ప్రోత్సహించా లన్నారు. మరిన్ని పరిశోధనలు చేపట్టేలా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలోని మొట్టమొదటి న్యాక్ ఎం గ్రేడ్ సాధించిన జెఎన్‌టియుకె యూనివర్శిటీ అధికారులను, అధ్యాపకులను, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
విసి జివిఆర్.ప్రసాదరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సహకారంతో విశ్వవిద్యాలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కళాశాలలు మెరుగైన న్యాక్ గ్రేడ్ సాధించాలని సూచించారు. ఖేలో ఇండియా ప్రాజెక్ట్‌లో భాగంగా జెఎన్‌టియుకె స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ బృందం పరిశీలించిందన్నారు. దీనికి ఎంపీ గీత ఎనలేని కృషి చేశారన్నారు.
జెఎన్‌టియుకె పూర్వ విద్యార్థి, తూర్పు గోదావరి జిల్లా సబ్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. సివిల్స్, గేట్, క్యాట్, జిఆర్ తదితర పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం యశ్వంత్‌కుమార్‌రెడ్డికి యంగ్ అచీవర్ అవార్డును అందించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అతిథులు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, యుసిఇకె, యుసిఇఎన్ ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, స్పెషల్ ఆఫీసర్లు, అధ్యాపకులు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపల్స్, యాజమాన్యాలు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










