ప్రజాశక్తి - ఆదోని
పట్టణ శివారులోని మంగ రాజ స్వామి దేవాలయం సమీపంలో వెలసిన శ్రీహజరత్ సయ్యద్ షా మహ్మద్ జలాలుద్దీన్ ఖాద్రీ రహమతుల్లాలై ఉరుసు వేడుకలు ఘనంగా సాగాయి. శుక్రవారం ఉరుసు సందర్భంగా దర్గాలో ప్రత్యేక ఫాతేహాలు, ప్రార్థనలు, చదివింపులు నిర్వహించారు. ఉరుసు నిర్వాహకులు, దర్గా పీఠాధిపతి ఖలీల్ సాహెబ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి స్వామివారి గంధం మహోత్సవం నిర్వహించారు. పెద్ద మసీదు ఇమామ్ సాబ్ సయ్యద్ హబీబుల్లా సాహెబ్ గంధం తీసుకు రాగా పకీర్ సాబ్‌ల విన్యాసాలతో వందలాదిమంది భక్తుల సమక్షంలో వేడుకలు జరిగాయి. శుక్రవారం ఉరుసు నిర్వాహకులు దర్గా పీఠాధిపతి ఖలీల్ సాహెబ్ మాట్లాడుతూ... ఎన్నో దశాబ్దాలుగా స్వామి వారి ఉరుసు ఉత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దర్గాలో స్వామివారి ప్రత్యేక సమాధికి బుధవారం గుసూల్ కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించామన్నారు. గురువారం రాత్రి దర్గాలో స్వామివారి గంధం వైభవంగా జరిగిందని తెలిపారు. భక్తులకు ప్రత్యేకంగా భోజన వసతిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
చదివింపులు చేస్తున్న భక్తులు










