ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలనే కోరిక ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు అత్యంత ప్రతిభా పాటవాలతో కూడిన విద్యను అభ్యసించినప్పుడే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని సెట్‌వెల్ సిఇఒ మెహర్రాజ్ అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని, తద్వారా మంచి అలవాట్లతో కూడిన నాణ్యమైన విద్యను అభ్యసించాలన్నారు. దెందులూరు మండల పరిధిలోని వేగవరం హేలాపురి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మెహర్రాజ్ మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా అధ్యాపకుల అడుగుజాడల్లో విద్యనభ్యసించినప్పుడే పూర్తిస్థాయిలో రాణించగలుగుతారన్నారు. జిల్లా టూరిజం శాఖా మేనేజర్ పట్టాభి రామయ్య, జిల్లా క్రీడా శాఖ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నతస్థాయిల్లో ఉద్యోగాలు అందిపుచ్చుకోవాలని, అప్పుడే కన్నవారి కలలకు పూర్తి న్యాయం చేయగలుగుతారన్నారు. ముందుగా కళాశాల విద్యార్థుల సమక్షంలో కేక్‌ను కట్ చేసి ఫ్రెషర్స్ డే వేడుకలను ప్రారంభించారు. ప్రముఖ సైకాలజిస్ట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు ఏ విధంగా ఉండాలో అధ్యాపకులతో, ఏవిధంగా నడుచుకోవాలో, ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించాలో, ఆరోగ్యంగా ఎలా ఉండాలో అనే అంశాలపై విద్యార్థులకు పూర్తిస్థాయిలో వివరించారు. అనంతరం సెట్‌వెల్ అధికారులు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం బ్రోచర్‌ను విడుదల చేశారు. పలు క్రీడల్లో విజయంసాధించిన క్రీడాకారులకు బహుమతులు, క్రీడాకారులకు జిల్లా క్రీడా శాఖ తరపున క్రికెట్ కిట్‌ను అందజేశారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కతి కార్యక్రమాలను విద్యార్థులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సెట్‌వెల్ ఎఒ జాన్ కెనడి, కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ఎం.రాధాకృష్ణ, కళాశాల ఎఒ టి.కరుణానిధి, సీనియర్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరావు, మెకానికల్ హెచ్‌ఒడి శివరాజ్, సివిల్ హెచ్‌ఒడి తేజ, ఇసి హెచ్‌ఒడి జెస్సీ కిరణ్, డైరెక్టర్ అడ్మిషన్స్ పి.చిన్ని, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










