
ప్రజాశక్తి -ములగాడ : ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకులు డాక్టర్ గరికపాటి రాజారావు వర్థంతిని వెంకన్నపాలెం సిఐటియు కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. రాజారావు చిత్రపటానికి సిఐటియు నేత కె.పెంటారావు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి మల్కాపురం జోన్ గౌరవాధ్యక్షులు ఆర్.లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, వైద్య వృత్తి మాత్రమే కాకుండా అనేక నాటకాలను ప్రదర్శించి ప్రజలను చైతన్యం చేసేవారని కొనియాడారు. రాజారావు ఆశయ సాధనలో నడుచు కోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారులు డి.రాము, బి.సూరిబాబు, బి.రాంబాబు, కె.రమణ, రాజు, సిఐటియు నాయకులు పి.పైడిరాజు, జి.నరేష్, ఎం.కృష్ణారావు పాల్గొన్నారు.
ఆదర్శవంతుడు గరికపాటి
ఉక్కునగరం : ఉక్కునగరంలోని సిఐటియు కార్యాలయంలో డాక్టర్ గరికపాటి రాజారావు వర్థంతిని నిర్వహించారు. ప్రజా నాట్యమండలి సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి విశాఖ జిల్లా అధ్యక్షులు గుర్రం రమణ, స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరాం మాట్లాడుతూ, ప్రజలకు సందేశాన్ని అందించడానికి మాటల కంటే పాటలు గొప్పవన్నారు. సున్నితంగా స్పష్టంగా ప్రజల గుండెలను తాకుతాయని పేర్కొన్నారు. సమాజంలో మార్పు కోసం కళాకారులు కలిసి గట్టిగా పని చేయాలని కోరారు. కృష్ణార్జున అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కె.సత్యనారాయణ, జి.సత్యనారాయణ, వరకుమార్, కె.శ్రీనివాస్, నాగలింగం, భాస్కర్, సింహాచలం, శంకరరెడ్డి సువర్ణరాజు, ఇతర కళాకారులు పాల్గొన్నారు.