Dec 22,2022 22:46

అనంతవరం హైస్కూల్లో ప్రదర్శనను తిలకిస్తున్న ఎంపిపి కె.రాంబాబు

ప్రజాశక్తి -యంత్రాంగం
జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో గురువారం గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస్‌ రామానుజన్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భీమునిపట్నం : స్థానిక పిఎన్‌ఎం జివిఎంసి ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో నిర్వహిస్తున్న శ్రీ రామానుజన్‌ గణిత అకాడమీ వ్యవస్థాపకులు కె వీరవెంకట సత్యనారాయణ సోదరులు గణిత శాస్త్ర పరీక్షలకు సంబంధించిన నమూనా ప్రశ్న పత్రాలను పాఠశాలకు అందజేశారు. పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన పలు గణిత నమూనాలతో కూడిన ఎగ్జిబిషన్‌ ఎంతగానో ఆలోచింప జేసింది.ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం తిరుమల శ్రీదేవి, గణితం, సైన్స్‌ ఉపాధ్యాయులు మహాలక్ష్మి, కుమారి, నాగ భూషణం, ఆదర్శ హిందీ ప్రేమీ మండలి అధ్యక్షులు కెఎస్‌ఆర్‌ కృష్ణా రావు పాల్గొన్నారు.
తగరపువలస : జివిఎంసి ఒకటో వార్డులోని ప్రాథమిక పాఠశాలలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్‌ రామానుజన్‌ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రెడ్డిపల్లి అప్పలరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సీతమ్మధార : బాల వికాస ఫౌండేషన్‌ ఆధ్వర్యాన అక్కయ్యపాలెంలోని వాగ్దేవి స్కూల్‌లో ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పారిశ్రామిక వేత్త భరణికాన రామారావు హాజరై శ్రీనివాస్‌ రామానుజన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల వికాస్‌ ఫౌండేషన్‌ కార్యదర్శి నరవ ప్రకాశరావు, పాఠశాల ప్రిన్సిపల్‌ ఎంవివి.సత్యనారాయణ, వైస్‌ ప్రిన్సిపల్‌ శైలజ, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పద్మనాభం : మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో గురువారం గణిత శాస్త్ర దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శ్రీనివాస రామానుజన్‌ చిత్రపటానికి ఎంపిపి కె.రాంబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు 30 రకాల గణిత ప్రాజెక్టులు తయారుచేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో
అనంతవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణకుమార్‌, సర్పంచ్‌ జి.లక్ష్మి, గణితం ఉపాధ్యాయులు రామకృష్ణ, దీనలత పాల్గొన్నారు.