ప్రజాశక్తి-యంత్రాంగం
గిడుగు రామమూర్తి పంతులు 159వ జయంతిని విశాఖ జిల్లాలో పలుచోట్ల సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎయులో
విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం తెలుగు విభాగం ఆధ్వర్యాన తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు విభాగాధిపతి ఆచార్య జర్రా అప్పారావు మాట్లాడుతూ, సమాజ హితం కోసం పనిచేసిన మహనీయుడు, బడుగు బలహీన, గిరిజన ప్రజల మనిషి, భాష కోసం నిరంతరం పాటుపడ్డ భాషావేత్త గిడుగు అని కొనియాడారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన గిడుగు రామమూర్తి మునిమనవడు గిడుగు నాగేశ్వరరావు మాట్లాడుతూ, పరభాషా వ్యామోహంలో పడి నేటి యువత మాతృభాషా మాధుర్యాన్ని పొందలేకపోతున్నారని ఆవేదన చెందారు. గురజాడ అప్పారావు మునిమనవడు గురజాడ ప్రసాదరావు, ఇందిర మాట్లాడుతూ, సమాజాన్ని మేల్కొల్పింది భాషేనని, అది తెలుసుకున్న గిడుగు తెలుగు భాషకు గొడుగై నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బూసి వెంకటస్వామి, ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంతీయ కేంద్ర సంచాలకులు డాక్టర్ జి ధర్మారావు, ఆచార్య వెలమల సిమ్మన్న తెలుగు ఆచార్యులు అయ్యగారి సీతారత్నం, డాక్టర్ ఎ.ఈశ్వరమ్మ, డాక్టర్ కె.రత్నశేఖర్, డాక్టర్ పి.లావణ్య, ఆతుకూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
తగరపువలస : భీమిలి మండలం తాటితూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పెందుర్తి: స్థానిక శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి బి.సూర్యకళ ఆధ్వర్యాన గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో కనకమహాలక్ష్మి, కెవి రావు, శ్రీకాంత్, వై.ఎర్నాజి, జి.వెంకటకృష్ణ పాల్గొన్నారు. స్థానిక ఆదర్శ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యాన తెలుగు భాష దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపల్ ఎన్‌ఇ.ఫ్లోరా ఆధ్వర్యాన విద్యార్థులు 'మా తెలుగు తల్లి' గీతాన్ని అలరించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ వైస్ ప్రిన్సిపల్ ఎ.శ్రీనివాసరావు, ఏవో జి.రవిబాబు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.










