Dec 17,2022 23:00

ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ : ఏకలవ్య ఆదర్శ పాఠశాలల మూడో జాతీయ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ శనివారం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎపి గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ ఇనిస్టిట్యూట్స్‌ సొసైటీ నిర్వహిస్తున్న ఈస్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్‌ సరుత జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని కలిగించేందుకు, క్రమశిక్షణకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, అరకు ఎంపి మాధవి, పాలకొండ ఎంఎల్‌ఎ కళావతి, వివిధ పాఠశాలల డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈపోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సుమారు వెయ్యి మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యారు. పోటీల ప్రారంభం సందర్భంగా ఆయా రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టి పడేవిధంగా ప్రత్యేకంగా నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పోటీలు ఈనెల 22వ తేదీ వరకు విజయవాడలోని ఆంధ్రా లయోలా కళాశాల, గుంటూరు వద్ద గల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతాయి.