Jul 20,2022 00:55

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున

ప్రజాశక్తి - విశాఖపట్నం : ఆంధ్ర వైద్య కళాశాల (ఎఎంసి) 100వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళవారం సాయంత్రం ఎఎంసిలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముందుగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎఎంసి, కెజిహెచ్‌లకు ఈ రోజెంతో చిరస్మరణీయమైనదన్నారు. తాను ఒక వైద్యునిగా ఎఎమ్‌సి, కెజిహెచ్‌లకు మేలు చేయాలనే ప్రాథమిక ప్రవృత్తిని కలిగి ఉన్నానన్నారు. ప్రతి ఒక్కరూ తమ పని వేళల్లో హాయిగా పని చేసుకుంటారని, వైద్య రంగంలో మాత్రం సమయం అనేది ప్రత్యేకంగా ఏమీ ఉండదని అన్నారు. ఇప్పటికే జిల్లాలో వైద్య ప్రయోజనాల కోసం చాలా అనుమతులు మంజూరు చేశామన్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మార్చురీ అభివృద్ధికి రూ.60 లక్షలు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రూ.25 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న పూర్వ విద్యార్థుల శతాబ్ది సెంటినరీ భవనాన్ని సంవత్సర కాల వ్యవధిలో పూర్తి చేస్తామన్నారు. సెంటినరీ భవనం కోసం చాలా ఉదారంగా సహకరిస్తున్న వైద్యులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఎఎంసి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.బుచ్చిరాజు మాట్లాడుతూ సెంటినరీ భవన నిర్మాణం కోసం విశాఖ జిల్లాలో నివాసముంటున్న పూర్వ విద్యార్థులు రూ.51 లక్షలు అందజేశారన్నారు. ఇతర దేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు రూ.12 కోట్లు ఇస్తామని ప్రకటించినట్టు తెలిపారు. అనంతరం కళాశాల వందో వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కెజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.మైథిలి, డాక్టర్‌ వి.మన్మధరావు, డాక్టర్‌ శశి ప్రభ, తదితరులు పాల్గొన్నారు.