ప్రజాశక్తి-నక్కపల్లి:ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు పుణ్యకోటి వాహనంలోనూ, గోదాదేవి అమ్మవారు పల్లకిలోనూ తిరు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ ఆచార్యులు, కృష్ణమాచార్యులు, ఆలయ సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు.
ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు పూర్తి
స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేంచేసియున్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకములు పూజాది కార్యక్రమములు నిర్వహించిన తరువాత సాయంత్రం 6 గంటల వరకు భక్తులందరికీ స్వామివారి దర్శనం సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ ఆచార్యులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులకు రంగనాథుని అలంకారంలో పుణ్యకోటి వాహనంలోనూ ఆలయంలో వివిధ వాహనాల్లో వివిధ ఉత్సవమూర్తులతో ఎనిమిది వాహనములలో తిరువీధి సేవ నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు .
వెంకన్నకు పూజలు
ఎస్.రాయవరం:ధనుర్మాసం వచ్చిందంటే ఏడుకొండల వెంకన్న భక్తులకు పండుగే. స్వామి వారి మాలధారణ చేసి పూజలు చేస్తూ ఆధ్యాత్మికంగా గడుపుతారు. శనివారం రాత్రి అడ్డురోడ్డులోని బత్తుల జగదీష్, అచ్చిరాజు సోదరుల ఇంట వెంకన్న పూజ లు కమనీయంగా సాగింది. ముందుగా గణపతి, లక్ష్మీ దేవి పూజల అనంతరం వేంకటేశ్వరస్వామి వారికి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కొరుప్రోలు సీతారామ భజనమండలి సభ్యులచే హరినామ సంకీర్తన (భజన) చేపట్టారు.










