ప్రజాశక్తి-విజయవాడ: డివైఎఫ్‌ఐ 43వ ఆవిర్భావ దినోత్సవం కృష్ణలంక 22, 21 డివిజన్లలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. డివైఎఫ్‌ఐ జెండాలను రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న ఆవిష్కరించి మాట్లాడుతూ రెండు కోట్ల సభ్యత్వంతో దేశంలోనే అత్యంత పెద్ద యువజన సంఘంగా డివైఎఫ్‌ఐ ఉందన్నారు. ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రజాస్వామ్య రక్షణలో, సోషలిజం స్థాపనే లక్ష్యంగా అనేక పోరాటాలు చేసిందన్నారు. నేడు దేశంలో మతోన్మాద శక్తులు రాజ్యమేలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ రాజ్యకాంక్షతో దేశ ప్రజల మధ్య బిజెపి మత చిచ్చుపెడుతుందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి విభజించి పాలిస్తున్నారని అన్నారు. ఒక పక్క దేశంలో నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందన్నారు. ఆకలిసూచీలో దేశాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేంద్రంలోని మోడీ-బిజెపికే దక్కుతుందన్నారు. బిజెపి రాజకీయ లబ్దికోసం ఆదాని, అంబాన్ని లాంటి కార్పొరేట్లకు దేశాన్ని దోచిపెడుతుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తూ దేశ సహజ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని మోడీ హామీనిచ్చి ఉద్యోగాలు కల్పించకపోగా 14 కోట్ల ఉద్యోగాలు కరోనా కాలంలో కోల్పోయారని పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు తొమ్మిది లక్షల ఖాళీ పోస్టులున్నాయని తక్షణమే వాటిని భర్తీ చేయాలని డివైఎఫ్‌ఐ పోరాడుతుందన్నారు. వేలాది మంది నిరుద్యోగులతో ఈ నెల 3న ఛలో ఢిల్లీ పిలుపునిచ్చామని, నిరుద్యోగులతో పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో ఉన్నయువత ఈ ర్యాలీకి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్షులు పుప్పాల కృష్ణ, తూర్పు నగర అధ్యక్షులు బత్తుల ఉమామహేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు కొండా, నాయకులు కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.










