Oct 03,2023 23:01

ప్రజాశక్తి-కాకినాడ ప్రపంచవ్యాప్తంగా హక్కుల కోసం పోరాడే కార్మిక ఉద్యమాలకు సంఘీభావంగా డబ్ల్యుఎఫ్‌టియు ఆవిర్భావ దినోత్సవాన్ని కేంద్ర కార్మిక సంఘాలు కాకినాడ మెయిన్‌ రోడ్డు ఎల్‌ఐసి ఆఫీసులో మంగళవారం ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, ఎఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షుడు కుంచే అంజిబాబు, ఐఎన్‌టియుసి ఆంధ్ర అండ్‌ తెలంగాణ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ తాళ్లూరు రాజు మాట్లాడారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం 1945 అక్టోబర్‌ 3న ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెడియన్స్‌) ఏర్పడి నేటికీ 78 సంవత్సరాలు పూర్తయిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన సరుకుల సంపదలో కార్మికుల వాటా ఏటా తగ్గుతోందని, అదే సందర్భంగా పెట్టుబడిదారుల వాటా గణనీయంగా పెరుగడానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న దోపిడీ విధానాలే కారణమని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వేతనాల పెరుగుదల కోసం, హక్కుల సాధన కోసం, దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలకు భారతదేశంలో కేంద్ర కార్మిక సంఘాలు సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తున్నాయన్నారు. భారతదేశంలో ఎటువంటి ఉత్పత్తి చేయకపోయినా మోడీ స్నేహితులైన అదానీ, అంబానీల సంపద కరోనా సంక్షోభంలో కూడా వేల రెట్లు పెరిగిన సంగతి గుర్తుచేశారు. ఇదే సందర్భంలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించి లక్షల సంఖ్యలో పరిశ్రమలు మూతబడి, కార్మికులకు ఉన్న ఉపాధి పోయి దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి పాలకులు క్రూరంగా నెట్టివేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సిఐటియు జిల్లా కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, జిల్లా కోశాధికారి మలకా రమణ, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, సిఐటియు వర్కింగ్‌ కమిటీ సభ్యులు మెడిశెట్టి వెంకటరమణ, సర్వే, ట్రాలీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సూర్యారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరపు అప్పలరాజు, రామకష్ణ, ప్రసాద్‌, కాశీ విశ్వనాథ్‌, శివపార్వతి, ఐఐఎఫ్‌టియు నాయకులు తిరుమలశెట్టి వెంకటరమణ, రాయుడు గోవిందు, కె.శ్రీనుబాబు, ఆర్‌.శివ, ఐఎఫ్‌టియు నాయకులు శ్రీపాదం సత్తిబాబు, మల్లాడి భైరవ స్వామి, సతీష్‌, సుబ్రహ్మణ్యం, ఎఐసిసిటియు నాయకులు నరసరాజు పాల్గొన్నారు.