Apr 09,2023 00:16

గోపాలపట్నంలో నివాళులర్పిస్తున్న జగ్గునాయుడు, వెంకటరెడ్డి తదితరులు

కంచరపాలెం : కంచరపాలెంలోని బిఎన్‌ఆర్‌ భవనంలో బొట్టా నరసింగరావు చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పార్టీ సీనియర్‌ నాయకులు ఎస్‌.అప్పలరాజు అధ్యక్షతన జరిగిన సభలో జగ్గునాయుడు మాట్లాడుతూ, ్‌ బొట్టా నర్సింగరావు తుది శ్వాసవరకూ పేదలు, కష్టజీవులు, కార్మికుల సమస్యలపై పోరాడారని కొనియాడారు. తోపుడుబండ్ల కార్మికులకు, ఇండిస్టియల్‌ ఎస్టేట్‌లో ఉన్న కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు యూనియన్లు పెట్టించి, వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేశారన్నారు. కార్పొరేటర్‌గా 36వ వార్డు సమస్యలపైనే కాకుండా నగరవ్యాప్తంగా ఉన్న సమస్యలన్నింటిపైనా కౌన్సిల్‌లో ప్రస్తావించి పరిష్కారానికి కృషిచేసేవారని తెలిపారు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని కొనియాడారు. బొట్టా నర్సింగరావు సోషలిజం రావాలని కోరుకున్నారని తెలిపారు. ఆ ఆశయం కోసమే పని చేశారని, మతతత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న పాలకులకు సరైన బుద్ధి చెప్పినప్పుడే నర్సింగరావుకు ఇచ్చిన నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.పద్మ, జోన్‌ సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు బి.సింహాచలం, ఒ.అప్పారావు, నాయకులు పి.రామారావు, జి.సూర్యచంద్రరావు, ఎస్‌.సుధాకర్‌, ఆర్‌ఎస్‌ఎన్‌, శ్రావణ్‌, ఒ.విజయ, ఎం.ఈశ్వరరావు, ఎ.పుష్ప, సుమిత్ర, నాయుడుబాబు పాల్గొన్నారు.
1000 మందికి మజ్జిగ పంపిణీ
బిఎన్‌ఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యాన కంచరపాలెం జాతీయ రహదానిలో గల బిఎన్‌ఆర్‌ భవనం వద్ద శనివారం మజ్జిగ పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్‌ సభ్యులు మాట్లాడుతూ, కంచరపాలెం ప్రాంతంలో ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ నా సమాజం బాగుండాలని ఆశించిన వ్యక్తి బొట్ట నర్సింగరావు అని కొనియాడారు. సమాజంలో పెరుగుతున్న ఆర్థిక, సామాజిక అసమానతలు, మత విద్వేషాలు మానవ సమాజానికి మంచివి కావని మిత్రులకు చెబుతుండేవారని పేర్కొన్నారు. ఆయన చిన్న వయసులోనే కేన్సర్‌ వ్యాధితో మరణించడం బాధాకరమన్నారు. ఆయన జ్ఞాపకార్థం కంచరపాలెంలో బిఎన్‌ఆర్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటుచేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎన్‌ఆర్‌ ట్రస్టీ కొయ్యి వెంకట అప్పారావు, లెక్చరర్‌ రాజేష్‌, ప్రతాప్‌, రోషన్‌, శ్రీను, లెక్చరర్‌ సతీష్‌, శివ, ఈశ్వరరావు, సూర్యచంద్రరావు, కంప్యూటర్‌ ఫ్యాకల్టీ ప్రభాకర్‌, సింహాచలం, బుజ్జి, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
తగరపువలస : స్థానిక సిఐటియు కార్యాలయంలో బొట్టా నరసింగరావు చిత్ర పటానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌.మూర్తి, రవ్వ నరసింగరావు, డి.బాబాజీ, పలువురు ముఠా కార్మికులు పాల్గొన్నారు.
సీతమ్మధార: సీతంపేట, దొండపర్తి, డైమండ్‌ పార్క్‌, శంకరమఠం, ఆర్‌కె.నగర్‌, చిట్టిబాబు కాలనీలలో సిఐటియు ఆధ్వర్యాన బొట్టా నర్సింగరావు వర్థంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జోన్‌ కార్యదర్శి ప్రకాశరావు, నాయకులు ఈశ్వరరావు, చంటి, రాజు తదితరులు పాల్గొన్నారు.
గోపాలపట్నం : గోపాలపట్నం సిఐటియు కార్యాలయంలో నర్సింగరావు చిత్రపటానికి సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సింగరావు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిపిఎంసి కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు పి.వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉరికూటి రాజు, గోపాలపట్నం జోన్‌ కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఆరిలోవ : ఆరిలోవ, తోటగరువు, బిఎన్‌ఆర్‌.నగర్‌లో సిపిఎం ఆరిలోవ జోన్‌ కమిటీ ఆధ్వర్యాన బొట్టా నర్సింగరావు వర్థంతిని నిర్వహించారు. నర్సింగరావు చిత్రపటానికి విసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి, సిపిఎం నగర కమిటీ సభ్యులు కోరెడ్ల రమాప్రభ పూలమాల వేసి నివాళులర్పించారు. బొట్టా నర్సింగరావు ఆశయ సాధన కోసం కృషి చేయాలని రమాప్రభ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వి.కృష్ణమూర్తి, ఐద్వా నాయకులు ఎస్‌.గౌరమ్మ, సిఐటియు ఆరిలోవ సెక్రటరీ రమణ, వై.అప్పారావు, బిఎన్‌ఆర్‌ నగర్‌ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
పెందుర్తి : స్థానిక సిఐటియు కార్యాలయంలో బొట్టా నర్సింగరావు వర్థంతిని నిర్వహించారు. సిఐటియు సీనియర్‌ నాయకులు బిటి.మూర్తి మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై పోరాటంలో ఆయన కృషి ఎనలేనిదని కొనియాడారు. తోపుడుబండ్ల కార్మికుల సంఘం ఏర్పాటుచేసి వారి శ్రేయస్సు కోసం పాటుపడ్డారన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జిఎస్‌.సూర్యప్రకాశరావు, అప్పారావు, బి.ప్రకాష్‌, రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.