ప్రజాశక్తి - హోళగుంద
హోళగుందలో బక్రీద్ పర్వదిన వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. గురువారం ముస్లింలు, పిల్లలు, మహిళలు అధిక సంఖ్యలో స్థానిక పెద్ద మసీదు నుంచి పురవీధుల్లో తిరుగుతూ ఆయా ఈద్గాలకు వెళ్లి ప్రార్థనలు చేశారు. హలే హదీస్ ఈద్గాలో మౌలి హబీబుల్లా ముస్లింలతో ప్రార్థనలు చేయించారు. మౌల్వి సమీయుల ఈద్గాలో ముస్లింలనుద్దేశించి ఉపన్యసిస్తూ దేశ పౌరులందరూ కలిసిమెలిసి ఉండాలని, దేశ ఐక్యత కోసం అందరూ ఒకేతాటిపై నిలవాలని కోరారు. హిందూ, ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. శాలి మసీద్ రాజా నగర్, పబ్లిక్ జమాత్ ఆధ్వర్యంలో బక్రీద్‌ను ఘనంగా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా పత్తికొండ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఆలూరు సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శ్రీనివాసులు, నరేంద్ర, భారీ సంఖ్యలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. దేవనకొండతో పాటు తెర్నేకల్, కోటకొండ, కరివేముల, ఎంకె.కొట్టాల, గుండ్లకొండ తదితర గ్రామాల్లో ముస్లింలు, పిల్లలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బక్రీద్ పండగ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మసీదు నుంచి ముస్లింలు పురవీధుల వెంట ఆయా ఈద్గాలకు తరలి వెళ్లి నమాజ్ చేశారు. ఎస్‌ఐ భూపాలుడు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చిప్పగిరి బంబం స్వామి దర్గా దగ్గర ఖురాన్ విశిష్టతను ముస్లిం మతపెద్దలు వివరించారు. నేమకల్ గ్రామంలో రోడ్డు సమీపంలో ఉన్న ఈద్గా దగ్గర ముస్లింలందరూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరినొకరు అలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో బక్రీద్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దకడబూరు గ్రామ శివారులో ఉన్న ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లింలతో కలిసి వైసిపి నేతలు పాల్గొన్నారు. వైసిపి మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచి రామాంజనేయులు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.










