ప్రజాశక్తి-పాడేరుటౌన్:భారతదేశ మొట్టమొదటి ప్రధాని నెహ్రూ జయంతి వేడుకలను పురస్కరించుకుని అల్లూరి జిల్లా వ్యాప్తంగా సోమవారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు చిన్నారులను అభినందించారు. చదువుకుంటేనే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని తలారిసింగి జిటిడబ్ల్యూ బాలుర ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం రీమలి జాన్, పాడేరు మండలం కందమామిడి జిటిడబ్ల్యూ బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం గంగబారు అన్నారు. పాఠశాలల్లో సోమవారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో హెచ్‌ఎం జాన్ మొక్కలను నాటారు. కందమామిడి బాలికల పాఠశాలలో వివిధ సాంస్కతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హుకుంపేట:విద్యతో పాటు క్రీడా రంగంలో కూడా విద్యార్థులు ముందుకు సాగాలని విద్యాశాఖ అధికారి ఎస్.పూర్ణ చందర్రావు అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో బాలల దినోత్సవ సందర్భంగా మండల్ లెవెల్ స్పోర్ట్స్, సంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ కోఆర్డినేటర్ విజయరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అనంతగిరి:మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం పురస్కరించుకుని ఆటలు పోటీలు, వ్యాసరచనలు నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేశారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజే శామని స్థానిక పాఠశాల 2 ప్రధానోపాధ్యాయులు బి. మంగ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
జి.మాడుగుల:మండల కేంద్రంలో మూడు రోడ్ల జంక్షన్ కూడలి వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ సువర్ణమ్మ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులు అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడి సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
అరకులోయ రూరల్: మండల కేంద్రంలోని కొండవీధి మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జాతీయ బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బాలల హక్కుల పరిరక్షణ వేదిక మండల కన్వీనర్ కొర్ర ప్రసన్నకుమార్, పెదలబుడు పంచాయతీ మాజీ ఎంపీటీసీ బురిడీ కోగేశ్వరరావు మాట్లాడారు. దేశానికి దిశ, దశ నిర్ధేశించేది బాలలే అన్నారు. అనంతరం వివిధ సాంస్కతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు.
డుంబ్రిగూడ:మండలంలోని కించుమండ స్కూల్ కాంప్లెక్స్ పరిధి కొసంగుడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పీతల విలియమ్ కేరీ ఆధ్వర్యాన బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రధానోపాధ్యాయుడు పీతల విలియమ్ కేరీ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర ఉద్యమంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
పెదబయలు:స్థానిక గిరిజన గురుకుల పాఠశాలలో నెహ్రూ జయంతి వేడుకలు ప్రిన్సిపాల్ శంకరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వడ్డేపుట్టు జిపిఎస్ ప్రభుత్వ పాఠశాల, బంగారు మెట్ట ఎంపీపీ పాఠశాలల్లో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. గిరి బాల నేస్తం పేరుతో ప్రతి ఏడాది గిరిజన మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యాన బాలల దినోత్సవం నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశామని మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు తల్లాపు కౌసల్య తెలిపారు. గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పృథ్విరాజు మాట్లాడుతూ, విద్యార్థుల వికాసానికి ఎంతగానో దోహదపడే ఇటువంటి కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. గిరిజన మహిళ సంఘం నాయకులు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బంగారు మెట్ట పాఠశాల చైర్మన్ లక్ష్మి, కొండమ్మ, పుష్ప పాల్గొన్నారు.
హుకుంపేట:జాతీయ, అంత్జాతీయ దినోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని హెచ్‌ఆర్‌సి సంస్థ జిల్లా సమన్వయకర్త టి.కృష్ణారావు తెలిపారు. కొట్నాపల్లి ఎంపియుపి పాఠశాలలో పార సంస్థ అధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు జి.ఉమామహేశ్వరరావు కేకు కట్ చేశారు. సంస్థ జిల్లా సమన్వయ కర్త టి.కృష్ణారావు మాటాడుతూ, దినోత్సవాలను అధికారికంగా నిర్వహించి, ఆయా దినాల ప్రాముఖ్యతను తెలియ జేయాలన్నారు.
రంపచోడవరం :మండలంలోని ముసురిమిల్లి పంచాయతీ చిన్న భారంగి మేరీ ఎయిడెడ్ ప్రైమరీ పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు వంశి కుంజం పాల్గొని దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చిత్ర పటానికి పులమాల వేసి నివాళులర్పించారు. పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలకు లెక్కలు, ఎక్కాలు, నృత్యం పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యాలయంలో సర్పంచ్ కోసు రమేష్ బాబు దొర, వార్డ్ మెంబరు సత్యవతి, వైసిపి నాయకులు రాజన్న దొర, బోబ్బా శేఖర్, స్కూల్ విద్య కమిటీ చైర్మన్ ముర్ల పద్మావతి, సూర్య చంద్ర భాస్కర టార్జాన్, హెడ్ మాస్టర్ విశ్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కొయ్యూరు : మండలంలోని పెదమాకవరం ఆశ్రమ పాఠశాలలో బాలల దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు బాక్సులు, పెన్నులు, పెన్సిల్స్ పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సీలేరు : జీకే వీధి మండలం సీలేరు డిఎవి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రామచంద్రరావు ఆధ్వర్యాన బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. పండిత నెహ్రూ పోరాటపటిమ, ఆయన గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం బాలలు నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న రాజ్యలక్ష్మి తన ఐదు నెలల మనవరాలిని శివుని రూపంలో అలంకరించింది.
చింతూరు : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని చింతూరు సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సోమవారం స్థానిక ఏజిహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో వివిధ ఆటల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పుస్తకాలు, మిఠాయిలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని దశలోనే అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఏజిహెచ్‌ఎస్ ప్రధాన ఉపాధ్యాయురాలు కృష్ణవేణి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
మారేడుమిల్లి : బాలల దినోత్సవం సందర్భంగా మండలంలోని తాడేపల్లి పంచాయితీ పరిధి కేవిలంక ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు వైసిపి మండల యూత్ నాయకుడు దూడ స్మిత్ సోమవారం పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్య కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి, ఉపాద్యాయులు సాల్మన్, ఆండ్రియా పాల్గొన్నారు.










