Dec 03,2022 23:45

కశింకోట భవిత కేంద్రంలో చిన్నారులతో ఎంపిపి కలగా లక్ష్మి,

అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని శనివారం జిల్లాలోని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల వికలాంగులకు ట్రై సైకిళ్లు, దుస్తులు పంపిణీ చేశారు.
ప్రజాశక్తి- బుచ్చయ్యపేట

వికలాంగుల సంక్షేమానికి వైసిపి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, త్వరలో వారి పింఛన్‌ పెంచే ఆలోచన ఉందని ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ అన్నారు. వికలాంగుల దినోత్సవం సందర్భంగా బుచ్చయ్యపేటలో వికలాంగులకు ట్రై సైకిళ్లు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెలు సత్యనారాయణ, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మరిసా నాని, ఎంపీడీవో సువర్ణ రాజు, వికలాంగుల సంఘం ప్రతినిధి కె.వెంకట్రావు పాల్గొన్నారు.
సబ్బవరం : స్థానిక భవిత కేంద్రంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామునాయుడు వికలాంగులకు వీల్‌ చైర్లు, సిపి చైర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం టీచర్లు సింహాద్రప్పడు, బేబీ రాణి, స్పెషల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ లెక్కల పద్మ, వైసీపీ నాయకులు కోటాన రాము, సబ్బవరపు నారాయణమూర్తి, కర్రి బాబు, ఎంపీటీసీ బైలపూడి దేముడు బాబు, సబ్బవరపు దేముడు బాబు పాల్గొన్నారు.
అనకాపల్లి : మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కార్యాలయంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వైసిపి పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్‌ కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కొణతాల భాస్కరరావు, పీలా రాంబాబు, కాండ్రేగుల శ్రీరామ్‌, శిల్పశెట్టి బాబి, దాడి ఈశ్వరరావు, కటారి దేవుడు, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి ఉడ్‌పేట విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పాత్రపల్లి వీరూ యాదవ్‌ ఆధ్వర్యంలో వికలాంగులకు పరికరాల పంపిణీ చేశారు. ఎస్డి గ్రూప్స్‌ అధినేత కాండ్రేగుల శ్రీరామ్‌ చేతుల మీదుగా ట్రై సైకిళ్లు, చంక కర్రలు, బ్లైండ్‌ స్టిక్స్‌, ఎల్బో స్టిక్స్‌ పంపిణీ చేశారు. ఈ పరికరాలకు విజువల్‌ చాలెంజర్స్‌ అసోసియేషన్‌ నాయకులు కొరుప్రోలు వెంకటేశ్వరరావు, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్‌ బాలు గాడి, విశాఖపట్నం వాస్తవ్యులు పల్లా నరేష్‌ ఆర్థిక సాయం అందించినట్లు వీరుయాదవ్‌ తెలిపారు. వికలాంగుల దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ వికలాంగులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి వికలాంగుల విభాగం నాయకులు నాదముని ఫణీంద్ర, బుద్ధ కాశి విశ్వనాధ్‌, పిల్ల లక్ష్మీనారాయణ, బత్తుల రాజా, శైలేష్‌ పాల్గొన్నారు.
కశింకోట : స్థానిక భవిత కేంద్రం వద్ద జరిగిన వికలాంగుల దినోత్సవంలో ఎమ్‌పిపి కలగా లక్ష్మి పాల్గొని మాట్లాడుతూ అంగవైకల్యాన్ని జయించి ముందుకు వెళ్లాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఇఅర్‌ టి.రమణమ్మ, వికలాంగుల ఉపాధ్యాయులు కొమాకులు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తాళ్ళపాలెం నూకాంబికా ఆలయం వద్ద సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో 200 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు.
యలమంచిలి : స్థానిక స్టేషన్‌ రోడ్డు హైస్కూలు భవిత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వికలాంగులకు ఎంపిపి బోదెపు గోవింద చేతుల మీదుగా ట్రై సైకిళ్లు, వీల్‌ ఛైర్లు, వినికిడి పరికరాలు అందించారు. వివిద సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ విశ్వనాథం, విశ్వేశ్వరరావు, హెచ్‌ఎం పాల్గొన్నారు.
దేవరాపల్లి : స్థానిక భవిత పిల్లల సంరక్షణ కేంద్రంలోని చిన్నారులకు ఎంపిపి కిలపర్తి రాజేశ్వరి భాస్కరరావు ట్రైసైకిళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మొల్లి కృష్ణమూర్తి, ఎంఇఒ సిహెచ్‌.రవీంద్రబాబు పాల్గొన్నారు.
చోడవరం : ఆర్క్‌ స్వచ్ఛంద సంస్థ స్థాపించిన విశాఖ జిల్లా వికలాంగుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు దుగ్గిరాల రవికుమార్‌ ఆధ్వర్యంలో ఎంపిడిఒ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.అరుణశ్రీ, నన్నయ యూనివర్సిటీ పూర్వపు వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య ముర్రు ముత్యాల నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాసులమ్మ, ఇఒఆర్‌డి చైతన్య, రిటైర్డ్‌ ఆర్‌జెడి తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.
నక్కపల్లి : విభిన్న ప్రతిభ వంత విద్యార్ధులకు ప్రతీ ఒక్కరూ తగిన విధంగా చేయూతనందించాలని ఎంఈఓ డివిడి ప్రసాద్‌ కోరారు. శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా భవిత కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులకు వీల్‌ చైర్లతో పాటు వినికిడి యంత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ, సాధారణ విద్యార్థులు వలే విభిన్న ప్రతిభ వంతులు కూడా నేటి సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భవిత ప్రత్యేక ఉపాధ్యాయుడు పి.సిహెచ్‌. వి.ఎన్‌.మూర్తి, ఎమ్‌ఆర్‌సీ సిబ్బంది ఝాన్సీ, శేఖర్‌, అప్పలనాయుడు, గంగేశ్వరరావు, జ్యోతి, దేవి పాల్గొన్నారు.
గొడిచెర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా పాఠశాలలో వారం రోజులపాటు ఆటలు పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రత్యేక ఉపాధ్యాయురాలు షేక్‌ యాస్మిన్‌, ప్రధాన ఉపాధ్యాయలు రామా ప్రతాపరావు పాల్గొన్నారు.
చీడికాడ : వికలాంగులు ఐక్యతగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని జాతీయ వికలాంగుల హక్కుల పోరాట సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మారేడు పూడి రమణబాబు తెలిపారు. చీడికాడలో ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకలు శనివారం జరిగాయి. రమణబాబు మాట్లాడుతూ, వికలాంగులమని ఎవరు అధైర్య పడవద్దని, అందరం కలిసికట్టుగా ఉంటే ఏ పనైనా సాధించుకోవచ్చు అన్నారు. ఎంపీపీ కురచా జయమ్మ మాట్లాడుతూ, వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ ఎర్ర అప్పారావు, జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు జి.రాము, నియోజవర్గ వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మతల అప్పలనాయుడు, మండల వికలాంగుల అధ్యక్ష కార్యదర్శులు సంతోష్‌, లెక్కల గోవింద, సంఘం నాయకులు శ్రీ రామమూర్తి, శ్రీను పాల్గొన్నారు.
కోటవురట్ల : వెంకటాపురం గ్రామంలో మాజీ సర్పంచ్‌ కాళ్ళ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురికి వినికిడి యంత్రాలు అందజేశారు.టిడిపి వాణిజ్య విభాగపు అధ్యక్షుడు సుంకర బాబ్జి మాట్లాడుతూ, దివ్యాంగులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందజేయాలని, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆదరించాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.