ప్రజాశక్తి- కందుకూరు : అశేష భక్తజనుల మధ్య అంకమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది . వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి స్వీయ పర్యవేక్షణలో అత్యంత వైభవ పేతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తజనులు అశేషంగా దేవాలయానికి తరలివచ్చారు. దేవాలయ ప్రాంగణమంతా భక్తజన సందోహంతో కిక్కిరిసింది. అమ్మవారి దేవాలయాన్ని పలు రకాల పూల మాలలతో అందంగా తీర్చిదిద్దారు. ముందుగా దేవాలయంపై కలశ ప్రతిష్ట చేసి ,అనంతరం అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహౌత్సవాన్ని వేద పండితులు పూర్తి చేశారు .అమ్మవారిని దర్శించడానికి వేలాది మంది భక్తులు ఉదయం 11. గంటల నుండే క్యూ లైన్లలో బారులు తీరారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి ఆసాంతం పర్యవేక్షించారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహౌత్సవంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం దంపతులు, మాజీ మున్సిపల్ చైర్మన్ లింగయ్య నాయుడు, దేవస్థాన పునర్నిర్మాణ కమిటీ బాధ్యులు, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.










