Sep 17,2023 00:51

ప్రజాశక్తి - బాపట్ల రూరల్
ఆంగ్రూ వజ్రోత్సవ వేడుకలు శనివారం బాపట్ల ఫుడ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో కళాశాల అసోసియేట్ డీన్ వై రాధా మాట్లాడుతూ ఫుడ్ టెక్నాలజి పూర్తి చేసిన వారికి అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. పూర్వ విద్యార్థుల అనుభవాలను ప్రస్తుత విద్యార్థులకు వివరించారు. ఆరోగ్యకరమైన, సంపన్న దేశాన్ని రూపొందించడానికి ప్రస్తుత విద్యార్థులు ఆచరించదగిన విధి విధానాలను వివరించారు. ఏపీ ఏయు చట్టం 1963 జూన్ 12 ద్వారా 1964న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరుతో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించబడిందన్న విషయం అందరికీ తెలిసిందే. చారిత్రాత్మక విద్యాలయంలో ఎందరో విద్యార్థులు చదివి గొప్ప స్థానాల్లో ఉన్నారని తెలిపారు. గత 60 ఏళ్లుగా ఆంగ్రూలో నూతన వంగడాలపై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. పెరుగుతునన జనాభా అవసరాలకు తగ్గట్లు ఆహార ధాన్యం ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునే క్రమంలో డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బిటెక్ కోర్సు అందించే మొట్టమొదటి కళాశాల అన్నారు. రెండు దశాబ్దాలుగా 17బ్యాచ్ ల విద్యార్థులు ఇక్కడి నుండి ఉత్తీర్ణత సాధించిన చరిత్ర ఉందన్నారు. ముంబై ఆహార విశ్లేషకులు, కళాశాల పూర్వ విద్యార్థి ఎస్ శశికాంత్ గురించి పూర్తి వివరాలు తెలిపారు. చెన్నై లీడ్‌ ఇన్స్‌పెక్టర్‌, పూర్వ విద్యార్థి జి సుచరిత ఆడిటింగ్ విభాగంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అన్నారు. మైసూర్‌ సీనియర్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ ఆఫీసర్‌, పూర్వ విద్యార్థి టి సాయి మణిదీప్ పరిశ్రమల్లో పనితనం, తీసుకోవాల్సిన  జాగ్రత్తలు వివరించారు. తిరువనంతపురం సిఎస్‌ఐఆర్‌, ఎన్‌ఐఎస్‌టి సైంటిస్ట్‌, పూర్వ విద్యార్థి డాక్టర్ కె అంజనేయులు ఉద్యోగులుగానే కాకుండా శాస్ర్తవేత్తలుగా ఎదిగి దేశానికి ఉపయోగపడాలన్నారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ కె సౌజన్య, వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల డీన్‌ డాక్టర్ ఏ మణి, డాక్టర్ పి సాంబశివరావు, డాక్టర్ డిడి స్మిత్, రిటైర్డు డీన్‌ డాక్టర్ సి సుకుమారన్, డాక్టర్ వి రామసుబ్బారావు, కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్‌వివి సత్యనారాయణ, డాక్టర్ సిహెచ్ సోమేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ విమల బీర, డాక్టర్ బ్లేస్సి సాగర్ పాల్గొన్నారు.