Nov 02,2023 00:55

గుంటూరులో జాతీయ జెండాకు వందనం చేస్తున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తదితరులు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తూ జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర 68వ అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్‌ పెరెడ్‌ గ్రౌండ్‌లో జాతీయ జెండాను కలెక్టర్‌ ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సాయుధ పోలీస్‌ దళాలు మార్చ్‌ ఫాస్ట్‌ నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి జిల్లా కలెక్టర్‌తోపాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవిఎస్‌బిజి పార్ధసారధి, జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టీనా, ఎమ్మెల్సీలు కెఎస్‌ లక్ష్మణరావు, చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్యేలు మహమ్మద్‌ ముస్తఫా, మద్దాలి గిరిధారరావు, జెసి జి.రాజకుమారి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, అడిషనల్‌ ఎస్పీలు కె.సుప్రజ, కోటేశ్వరరావు, శ్రీనివాసరావు (క్రైమ్‌), ఆప్కో ఛైర్మన్‌ గంజి చిరంజీవి, నగరపాలక సంస్థ మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌ నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గుర్తింపు పొందిందని చెప్పారు. 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. ఉచిత పంటల బీమా కింద 14,542 మంది రైతులకు రూ.4.16 కోట్లు అందిచామన్నారు. సూక్ష్మ సాగు నీటి పథకం ద్వారా 2023-24లో 740 మంది సన్నా, చిన్నకారు రైతులకు రూ.4.14 కోట్లతో డ్రిప్‌, స్ప్రీంక్లర్‌ పరికరాలను 90 శాతం రాయితీతో అందించామన్నారు. ప్రధాన మంత్రి ఉపాధి పథకం ద్వారా 40 యూనిట్లకు రూ.3.20 కోట్ల సబ్సిడీ అందించినట్లు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా 447 సచివాలయాల పరిధిలో మెడికల్‌ క్యాంపులు నిర్వహించి 1.52 లక్షల మందికి వివిధ రకాల వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.221.69 కోట్లతో 83,659 మందికి ఆపరేషన్లు చేయించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ఔనత్యం, తెలుగు భాష గొప్పదనంపై జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఎం.పురుషోత్తం, ముంతాజ్‌ పఠాన్‌, కె.భవానీ, డైరెక్టర్లు కె.నాగేశ్వరి, పి.మేరి, కె.చిన్నపరెడ్డి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ సజీలా, డిఆర్‌ఒ కె.చంద్రశేఖరరావు, జెడ్‌పి సిఇఒ మోహన్‌రావు, డిఆర్‌డిఎ పీడీ హరిహరనాథ్‌, ఆర్‌డిఒ పి.శ్రీఖర్‌, డిప్యూటీ కలెక్టర్‌ (ట్రైనీ) కె.స్వాతి పాల్గొన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస ప్రసాద్‌ అధ్యక్షతన సభ నిర్వహించగా ప్రిన్సిపాల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ జడ్జి పార్ధ సారధి, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ మాట్లాడారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలేశారు. జెండాయ జెండాను సూపరింటెండెంట్‌ ఆవిష్కరించారు.
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహాలు, చిత్రపటాలకు నాయకులు, అధికారులు పూలమాలలేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సభ నిర్వహించగా వీసీ పి.రాజశేఖర్‌ మాట్లాడారు. మంగళగిరి పట్టణంలోని మెయిన్‌ బజార్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే ఆర్కే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎం.మల్లేశ్వరరావు, ఎమ్‌డి ఫిరోజ్‌, ఎస్‌.బాలాజీ గుప్తా, డి.భగవన్నారాయణ, స్వరూప రాణి, కె.బోయేజు, బి.నర్సయ్య పాల్గొన్నారు. తాడికొండలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుంటూరులోని హిందూ కాలేజీ సెంటర్‌ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌, మేయర్‌ మనోహర్‌నాయుడు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్పొరేటర్లు ఎస్‌.ఉమామహేశ్వరి రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. పొన్నూరులో పొట్టి శ్రీరాములు పవిత్ర స్మారక పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఐలాండ్‌ సెంటర్లో సభ నిర్వహించగా ఎమ్మెల్యే కిలారు వెంకటరోశయ్య మాట్లాడారు. తెనాలిలో బోస్‌రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ పూలమాలలేశారు. మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఎం.హరిప్రసాద్‌, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుల భాస్కరుని శ్రీనివాసరావు, ఆర్యవైశ్య మహాసభ నాయకుటు సాదుప్రతాప్‌ తదితరులున్నారు. టిడిపి కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పూలమాలలేశారు. నాయకులు పి.వెంకట్రావ్‌, టి.హరిప్రసాద్‌, డి.యుగంధర్‌, ఎ.శివ పాల్గొన్నారు. బోస్‌రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి జనసేన పిఎసి చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ నివాళులర్పించారు. నాయకులు దివ్వెల మధుబాబు, జాకీర్‌ హుస్సేన్‌, హరిదాసు గౌరీశంకర్‌ పాల్గొన్నారు. చేబ్రోలు మండల పరిషత్‌ కార్యాలయంలో చిత్రపటానికి ఎంపిడిఒ బి.బాబురావు పూలమాలలేశారు.