Nov 03,2023 00:43

ఐసిఐడి కాంగ్రెస్‌ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్‌ తదితరులు

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : జల సంరక్షణపై 25వ ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ కాంగ్రెస్‌ (ఐసిఐడి) సమావేశాలు విశాఖ బీచ్‌ రోడ్డులోని రాడిషన్‌ బ్లూ హోటల్‌లో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వారం రోజులుపాటు జరిగే వీటిలో పలు దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. తొలి రోజు సదస్సును కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ వ్యవసాయ రంగం నీటి కొరతతో కరువు పరిస్థితులు చవిచూస్తోందని, దీన్ని అధిగమించేలా సరైన నీటి పారుదల నిర్వహణ విధానం ఎంతైనా అవసరముందని చెప్పారు. ఎపిలో 40 ప్రధాన మధ్యతరహా, చిన్న నదులున్నాయని, వ్యవసాయం, నీటిపారుదల రంగాల్లో శతాబ్దాలుగా రాష్ట్రం గొప్ప వారసత్వాన్ని కలిగి ఉందని తెలియజేశారు. నేటి పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టూ కీలకంగా మారిందన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ మాట్లాడుతూ దేశం ఇరిగేషన్‌లో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. నీటి రంగంలో సమగ్ర విధానంతో కేంద్రం ఉందన్నారు. ఈ కాంగ్రెస్‌లో ఐసిఐడి అధ్యక్షులు డాక్టర్‌ రగాబ్‌, ఉపాధ్యక్షులు కుష్వేందర్‌ ఓహ్రా, పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
ఎంవిపి కాలనీ :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి గురువారం విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆయన వెంట రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నగరానికి చేరుకున్నారు. రాడిసన్‌ బ్లూ హోటల్‌లో 25వ అంతర్జాతీయ కాంగ్రెస్‌, 74వ అంతర్జాతీయ కార్యనిర్వాహక సమావేశాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి ఉదయం 8.55 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి విడదల రజని, మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సుభద్ర, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, ఎంపీలు బివి.సత్యవతి, జి.మాధవి, డిసిసిబి చైర్మన్‌ కోలా గురువులు, జాయింట్‌ కలెక్టర్‌ కెఎస్‌. విశ్వనాధన్‌, ఆర్‌డిఒ హుస్సేన్‌ సాహెబ్‌, పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 9.08 గంటలకు అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనేందుకు మధురవాడ వెళ్లారు.
సమావేశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కార్యక్రమం అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12.10 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకొని 12.22 గంటలకు గన్నవరానికి బయలుదేరి వెళ్లారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వీడ్కోలు పలికారు. హెలీప్యాడ్‌ వద్ద ముఖ్యమంత్రిని విశాఖ ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాల వైసిపి సమన్వయకర్తలు కెకె.రాజు, ఆడారి ఆనంద్‌కుమార్‌ వేర్వేరుగా కలిసి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. విశాఖ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు, గండిగుండం సర్పంచ్‌ గండ్రెడ్డి శ్రీనివాసరావు ముఖ్యమంత్రిని కలిసి సర్పంచుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.