ప్రజాశక్తి-లీగల్ విలేకరి : ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) విశాఖపట్నం యూనిట్ నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా సురేష్, వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఐలు విశాఖపట్నం జిల్లా మహాసభలు శనివారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా దామోదర్ సంజీవయ్య లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పి,శ్రీసుధ హాజరై మాట్లాడారు. 'స్వతంత్ర న్యాయవ్యవస్థ జవాబుదారీతనం' అంశంపై పలు సుప్రీంకోర్టు తీర్పులను వివరిస్తూ ప్రసంగించారు. విశ్రాంత జిల్లా న్యాయమూర్తి యు.సత్యారావు భారతీయ వారసత్వ చట్టం, చట్టం సవరణలను వివరించారు. అనంతరం మధ్యాహ్నం డెలిగేట్స్ సమావేశంలో ప్రధాన కార్యదర్శి నివేదికను సమర్పించారు. మణిపూర్, హర్యానాలో జరిగిన మత ఘర్షణలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. తదుపరి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మూడేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికలో గౌరవాధ్యక్షులుగా బివి రామాంజనేయరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సీనియర్ న్యాయవాదులు అల్లు సురేష్, ఎన్.వెంకటేశ్వరరావు, కోశాధికారిగా అప్పలరెడ్డిని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గానికి న్యాయవాద సంఘం అధ్యక్షులు ప్రధాన, కార్యదర్శులు ఇతర న్యాయవాది మెంబర్లు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయవాద సంఘం అధ్యక్షులు చింతపల్లి రాంబాబు, ప్రధాన కార్యదర్శి పైలా శ్రీనివాసరావు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సభ్యులు సిహెచ్.ఆనందరెడ్డి, బగాది తులసీదాస్, పూర్ణిమ, శాస్త్రి, సింధుజ, ఇతర న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు.










