Feb 11,2023 23:43

పేదలకు బట్టలు పంపిణీ చేస్తున్న నాగభూషణం తదితరులు

ప్రజాశక్తి-అనకాపల్లి
ప్రముఖ సినీ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావుకు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని సిద్ధార్థ సోషల్‌ సర్వీస్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు బల్ల నాగభూషణం విజ్ఞప్తి చేశారు. ఘంటసాల 49వ వర్ధంతి సందర్భంగా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం పేదలకు బట్టలు, పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలనచిత్ర చరిత్రలో తనదైన శైలిలో పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడి తన గాన మాధుర్యంతో ప్రపంచంలో తెలుగు ఖ్యాతిని వ్యాప్తి చేసినట్లు చెప్పారు. ఘంటసాల ఆలపించిన భగవద్గీత విశ్వవ్యాప్త ప్రాచుర్యం పొంది ఆయన కీర్తిని అంతర్జాతీయ పటంపై నిలబెట్టిందన్నారు. అనకాపల్లిలో ఘంటసాల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ముందుగా ఘంటసాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు విన్నకోట నీలేష్‌ గుప్తా, కార్యదర్శి వి సత్యనారాయణ, ఆర్‌ మల్లేశ్వరరావు, పి కృష్ణమోహన్‌, ఆర్‌. చందర్రావు తదితరులు పాల్గొన్నారు.