ప్రజాశక్తి-సిరిపురం : భారతదేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమించి పద్దెనిమిది నెలలు జైలు జీవితం అనుభవించిన ఘంటసాలకు భారత రత్న ఇవ్వాలని కళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివారం ఆర్‌కె.బీచ్ రోడ్డులోని ఘంటసాల విగ్రహం వద్ద శత జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఘంటసాల ఇరవై ఏళ్ల ప్రాయంలో తన పాటలు, రచనలతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. సాగర తీరంలో ఉన్న ఆయన విగ్రహాన్ని జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడం దుర దృష్టకరమన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ, ఎన్ని తరాలు మారినా ఘంటసాల గీతాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి చెన్నా తిరుమలరావు ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో ఏడీసీపీ మహ్మద్ ఖాన్, కొణతాల రాజు, బొమ్మిడి సత్యనారాయణ, ఆడారి రామకృష్ణ, విద్యార్థి వెంకటరావు, ఎంవి.రాజశేఖర్, సినీ నిర్మాత పిఎన్.తిలక్, కెఎస్.ప్రకాష్, ఇందిరాసాహిణి, టి.రాధారాణి తదితరులు హాజరై ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా ఘంటసాల స్వర నిరాజనం పేరిట నిర్వహించిన సినీ సంగీత విభావరిలో డి.ఆనందరావు, సాహిణి పాడిన నాలోని రాగమీవే, బొమ్మిడి సుజాతా మూర్తి పాడిన నన్నుదోచు కుందువటే, ఖాన్ పాడిన భలే మంచి రోజు, లోకేష్, స్వరూప పాడిన ఊహలు గుస గుస లాడే, త్యాగరాజు, మను పల్లా పాడిన మధురాతి మధురం వంటి కొన్ని గీతాలు ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి.










