ప్రజాశక్తి- సీలేరు
జికె.వీధి మండలం సప్పర్ల ఘాట్ రోడ్డులో లోడ్‌తో ఉన్న లారీ సోమవారం ఉదయం మరమ్మత్తులకు గురై ప్రధాన రహదారిపై అడ్డంగా నిలిచిపోయింది. దీంతో రోజంతా రాకపోకలు స్తంభించిపోయాయి. జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ ధర్మపురం ఘాట్ రోడ్డులో ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం రాజస్థాన్ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న ఒక లోడ్ లారీ మరమ్మతులు గురై రోడ్డుకి అడ్డంగా నిలిచిపోయింది. దీంతో గంటల తరబడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విశాఖ నుంచి సోమవారం ఉదయం భద్రాచలం బయలుదేరిన బస్సు, భద్రాచలం నుంచి విశాఖకు బయలుదేరిన బస్సు రెండూ ధర్మాపురం వద్ద ఇరువైపులా ఆగిపోయాయి. దీంతో బస్సుల్లోని ప్రయాణికులు అడవులో అన్న పానీయాలు లేక ఆకలితో అలమటిస్తూ అనేక ఇబ్బందులకు గురయ్యారు. మరమ్మలకు గురైన లారీ పక్క నుంచి వెళ్లేందుకు పెద్ద బండరాయి ఉండడంతో బస్సు ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. లారీ మరమ్మతులు చేయడానికి లారీ సిబ్బంది నర్సీపట్నం వెళ్లారు. అయినా మెకానిక్ రాకపోవడంతో మరమ్మతులు చేయలేని పరిస్థితి నెలకొంది.
దీంతో ఈ సమస్యను ఆర్టీసీ అధికారులకు, పోలీసులకు ఇరువురు డ్రైవర్లు, కండక్టర్లు తెలియజేశారు. దీంతో విశాఖపట్నం నుంచి భద్రాచలం వస్తున్న ప్రయాణికులను, పాడేరు నుంచి సీలేరు వస్తున్న ప్రయాణికులను మొత్తం 70 మందిని భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సును రివర్స్ చేసి ఆ బస్సులో సాయంత్రం 6 గంటల సమయానికి సీలేరు తీసుకొచ్చారు. అలాగే భద్రాచలం నుంచి విశాఖ వెళుతున్న ప్రయాణికులను విశాఖపట్నం నుంచి వచ్చిన బస్సును వెనక్కి మళ్లించి ఆ బస్సులో వారిని విశాఖపట్నం పంపించారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రయినా రహదారి అడ్డంగా నిలిసిపోయిన లారీ తొలగించకపోవడంతో రవాణా సౌకర్యానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.










