Nov 17,2023 17:39

గాజా  :   ఇజ్రాయిల్‌ అమానవీయ దాడులతో గాజా మొత్తం శిధిలాలతో నిండిపోయింది. గాజా స్ట్రిప్‌లోని అన్ని నగరాలు, సహాయక శిబిరాలు లక్ష్యంగా ఇజ్రాయిల్‌ దాడికి దిగింది. ఇజ్రాయిల్‌ వైమానిక దాడుల్లో శిధిలమైన నగరాలు, శిబిరాలకు సంబంధించిన మ్యాప్‌ను మీడియా విడుదల చేసింది. పలు సంస్థలు అందించిన గణాంకాలు, అంచనాల ప్రకారం మాత్రమే ఈ మ్యాప్‌ను అందించామని, వీటిని ధృవీకరించాల్సి వుందని తెలిపింది. విశ్వసనీయమైన మీడియా సంస్థలు మరియు ఐక్యరాజ్యసమితి ఆఫీస్‌ ఫర్‌ ది కో ఆర్డినేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌టేరియన్‌ ఎఫైర్స్‌ (యుఎన్‌ఒసిహెచ్‌ఎన్‌) అందించిన సమాచారంతో రూపొందించినట్లు వెల్లడించింది.

దక్షిణ గాజాలోని అల్‌ -రషీద్‌, సలాహ్  అల్‌-దిన్‌ రహదారులపై అక్టోబర్‌ 13న ఇజ్రాయిల్‌ చేపట్టిన వైమానిక దాడిలో అదనంగా 40 మంది మరణించనిట్లు ధృవీకరించింది. సుమారు 40,000 మంది ఉత్తర గాజా నుండి పారిపోయేందుకు వినియోగించిన ప్రధాన రహదారులుగా పేర్కొంది.

11వేల మందికి పైగా మృతులు
నవంబర్‌ 10 వరకు సుమారు 11,078 పాలస్తీనియన్లు మరణించినట్లు యుఎన్‌ఒసిహెచ్‌ఎన్‌ తెలిపింది. అయితే కమ్యూనికేషన్‌ లేకపోవడంతో నవంబర్‌ 10 తర్వాత మరణాలను గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నమోదు చేయలేదని యుఎన్‌ఒసిహెచ్‌ఎన్‌ పేర్కొంది. మొత్తం 11,078 మృతుల్లో 41 శాతం చిన్నారులు, 27 శాతం మహిళలు ఉన్నట్లు తెలిపింది. గాజా స్ట్రిప్‌లో గత మూడు వారాల్లో మరణించిన చిన్నారుల సంఖ్య గత మూడేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 20 కన్నా ఎక్కువ దేశాలలో ఏడాది పైగా సాయుధ పోరాటాలలో మరణించిన చిన్నారుల సంఖ్య కన్నా ఎక్కువని తెలిపింది. ఇజ్రాయిల్‌ వైమానిక దాడుల్లో సుమారు 27,000 మంది గాయపడగా, సుమారు 3,500 మంది గల్లంతయ్యారు. శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని భావిస్తోంది.

నిరాశ్రయులైన పాలస్తీనియన్లు
నవంబర్‌ 16 నాటికి గాజాస్ట్రిప్‌లోని ఐదు గవర్నరేట్లలో 70 శాతం పాలస్తీనియన్లు లేదా 1.6 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. వీరంతా 149 యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ శిబిరాలలో, ఆన్‌ యునిస్‌, రఫా గవర్నరేట్స్‌లలోని 92 శిబిరాలలో తలదాచుకుంటున్నారు. నవంబర్‌ 6 నుండి 16 వరకు 192 మంది వైద్య సిబ్బంది మరణించగా, 135 మంది వైద్య శిబిరాలపై దాడులు జరిగాయి. 55 అంబులెన్స్‌లు ధ్వంసం కాగా, 25 ఆస్పత్రులు, 52 హెల్త్‌కేర్‌ సెంటర్స్‌ నిరుపయోగంగా మారాయి.

ధ్వంసమైన నివాసాలు
గాజాలోని 45 శాతం హౌసింగ్‌ యూనిట్స్‌ ధ్వంసమైనట్లు యుఎన్‌ఒసిహెచ్‌ఎ తెలిపింది. వీటిలో 10,000కు పైగా భవనాలు, 41,000కు పైగా హౌసింగ్‌ యూనిట్స్‌ పూర్తిగా ధ్వంసమయ్యాయి. 2.2 లక్షల హౌసింగ్‌ యూనిట్స్‌ పాక్షికంగా దెబ్బతిన్నాయి.