Aug 20,2021 06:27

    వంట గ్యాస్‌ మండుతుంది. నరేంద్ర మోడీ పాలనలో దాని ధర అంతకన్నా తీవ్రంగా మండిపోతోంది. కేంద్ర ప్రభుత్వం బుధవారంనాడు గ్యాస్‌ సిలిండర్‌పై మరో 25 రూపాయలు వడ్డించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఏడు సార్లు వంట గ్యాస్‌ ధర పెంచింది. జనవరి 1న రూ.694 ఉండగా, ఇప్పుడు రూ.859కి ఎగబాకింది. ఎనిమిది నెలల్లో పెంపుదల రూ.165 అంటే 23.77 శాతం అన్నమాట. ఇంత తక్కువ వ్యవధిలో గ్యాస్‌ ధర అంత ఎక్కువగా పెంచడం దారుణం. మోడీ గద్దెనెక్కిన 2014లో సిలిండర్‌ ధర రూ.410 ఉన్నదల్లా ఇప్పుడు రెట్టింపు కన్నా మించిపోయింది. ఇలా పెంచుకుంటూ పోతే సహస్రానికి చేరుకోవడానికి అట్టే సమయం పట్టకపోవచ్చు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కష్టాల్లో వున్నవారికి ఇది మరింత భారమవుతుంది. కేంద్ర ప్రభుత్వం భారీ పబ్లిసిటీతో చేపట్టిన ఉజ్వల యోజన కింద ఎనిమిది కోట్ల గ్యాస్‌ కనెక్షన్లుండగా వాటిలో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌ నుండి జూన్‌) 3.2 కోట్ల మంది అంటే 40 శాతం వినియోగదార్లు ఒక్క సిలిండర్‌ కూడా తీసుకోలేదని ఇటీవల పార్లమెంటులో ఒక ప్రశ్నకు పెట్రోలియం శాఖామంత్రి సమాధానంగా చెప్పారు. గ్యాస్‌ బండ ధర ఇలా పెంచుకుంటూ పోతే ఇంకెవరు తీసుకోగలరు? చరిత్ర వెనక్కు మళ్లి కట్టెల పొయ్యి, పొగ చూరిన గోడలు దర్శనమిచ్చే రోజులు మళ్లీ దాపురిస్తాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
    గ్యాస్‌ బండ ధర విపరీతంగా పెంచుతోన్న ప్రభుత్వం సామాన్యులకు తానిచ్చే సబ్సిడీని కుదిస్తోంది. ఈ ఏడాది జనవరిలో రూ.30.76గా ఉన్న సబ్సిడీ జూన్‌ నాటికి రూ.15.38కి దిగ్గోశారు. సబ్సిడీ ఎత్తేస్తున్నట్టు సర్కారువారు ప్రకటించకపోయినా ఆ తరువాత వినియోగదారుల బ్యాంకు అకౌంట్లలో జమ కావడంలేదు. కేంద్రం వంట గ్యాస్‌ సబ్సిడీకి 2019-20లో రూ.29,627 కోట్లు ఖర్చు చేయగా 2020-21లో రూ.25,520 కోట్లకు తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.12,480 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎంత ఖర్చు చేస్తారో తెలియదు. మరోవైపున గ్యాస్‌పై ఎక్సైజ్‌ సుంకం ద్వారా కేంద్రం బొక్కసాన్ని నింపుకొంటోంది. గడచిన మూడేళ్లలో రూ.4,315 కోట్లు వసూలు చేసినట్టు కేంద్ర మంత్రి హర్‌దీప్‌ పూరీ పార్లమెంటుకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీరు 'మా ఇంటికొస్తే ఏం తెస్తావ్‌-మీ ఇంటికొస్తే ఏమిస్తావ్‌' అన్న చందంగా వుండడం దారుణం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా కేంద్ర ప్రభుత్వం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచడం దుర్మార్గం. అందుకు ఎక్సైజ్‌ సుంకం, సెస్సులు, సర్‌ఛార్జీల వడ్డన బాట పట్టడం అన్యాయం. లీటరు డీజిల్‌ ధర శతకానికి చేరువ కాగా పెట్రోల్‌ ఆ మార్కును ఎప్పుడో దాటేసింది. అన్నిటికీ అంతర్జాతీయ మార్కెట్‌ను సాకుగా చూపే కేంద్రం పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో మాత్రం ఆ సూత్రాన్ని వర్తింపజేయకపోవడం ద్వంద్వ నీతి! పెట్రో ఉత్పత్తులపై సుంకాలు, పన్నులను తగ్గించేది లేదని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడం బిజెపి సర్కారు కాఠిన్యానికి తార్కాణం.
కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం, కరోనా విపత్తు, లాక్‌డౌన్లు, తదనంతర ప్రభావాలతో సామాన్యుల ఉపాధి పోయి, ఆదాయాలకు భారీగా గండి పడింది. పిల్లల చదువుల మొదలు వృద్ధుల ఆరోగ్యం వరకు అనేక విషయాల్లో కుటుంబాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబానికిి నెలకు రూ.7500 నగదు బదిలీ చేసి తమను ఆదుకోవాలని ఘోషిస్తున్న ప్రజలకు అలా ఇవ్వడం లేదు సరికదా వారిపై మరిన్ని భారాలు వేయడం కేంద్ర ప్రభుత్వ కర్కశత్వాన్ని చాటుతోంది. రకరకాల ప్యాకేజీల పేరిట దేశ ఖజానాను, అప్పుల మాఫీతో బ్యాంకులనూ సంపన్నులకు నైవేద్యం చేస్తున్న మోడీ సర్కారు సామాన్యులకు మొండి చెయ్యి చూపుతోంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం, కార్మిక వర్గం దేశ వ్యాపిత పోరాటాలు నడుస్తున్నాయి. అవి విస్తృతం కావడంతోపాటు మరింతమంది ప్రజానీకం ఉద్యమాలు, ఆందోళనలు సాగించాలి. తద్వారా మాత్రమే ప్రభుత్వ విధానాలను తిప్పిగొట్టడం సాధ్యం.