రిగ్గుల వద్ద కానరాని రక్షణ చర్యలు
ఆకతాయిల ఆగడాలతో మరింత బెంబేలు
ప్రజాశక్తి - కొత్తపేట : గ్యాస్ లీకులతో కోనసీమ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నాలుగేళ్ల క్రితం మండలంలోని బిళ్లకుర్రు గ్రామం నెల్లివారి పేటలో ఒఎన్‌సి అధికారులు గ్యాస్ నిక్షేపాల వెలికితీత కోసం చమురుబావిని తవ్వారు. గ్యాస్‌ను తీసేందుకు రిగ్గును అమర్చారు. అక్కడ నుంచి వెలికితీసిన గ్యాస్‌ను పైపులైన్ ద్వారా మండపేటలో గెయిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కలెక్టింగ్ స్టేషన్‌కు పంపుతున్నారు. మొదట్లో గ్యాస్ సరఫరా సక్రమంగానే జరిగింది. ఈ రిగ్ ద్వారా వచ్చిన గ్యాస్ ఫ్రీజ్ అయిపోవడంతో పైపులైన్ల ద్వారా వెళ్లట్లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఏరియాలో మరో రిగ్ వేసి గ్యాస్‌ను పంపించాల్సి ఉంటుందని చెబుతున్నారు. గ్యాస్ సరఫరా సరిగా లేకపోవడంతో సంబంధిత అధికారులు సైతం ఈ రిగ్గును బాధ్యతారాహిత్యంగా వదిలేశారు.
పైకి తన్నుతున్న గ్యాస్
ఈ రిగ్గుకు ఉన్న ఒకబోల్టు పూర్తిగా తుప్పుపట్టింది. అక్కడ నుంచి గ్యాస్ ఆవిరిరూపంలో బయటకు వస్తుందని గ్రామస్తులు తెలిపారు. వెంటనే వారు ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. ఫైర్ ఆఫీసర్ కె.శ్రీనివాస్ సిబ్బందితో కలిసి హుటాహుటిన రిగ్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని రాజోలులోని ఒఎన్‌జిసి సీనియర్ ఇన్‌స్పెక్టర్ బి.కామేశ్వరరావుకు తెలియజేశారు. సోమవారం ఉదయం ఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. ఈ రిగ్ పరిధి మండపేట గేల్ వారి పర్యవేక్షణలో నడుస్తుందని తెలిపారు. వారు సిబ్బందికి చేరుకుని లీక్‌ను అరికట్టారు. అక్కడ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. రిగ్ సామర్థ్యాన్ని బట్టి వాల్స్ ఏర్పాటు చేస్తామని, గ్యాస్ ప్రెజర్‌ను దీని ద్వారా గుర్తిస్తారని తెలిపారు.
ఆకతాయిల ఆగడాలతో బెంబేలు
రిగ్ ప్రదేశం ఆకతాయిలకు అడ్డాగా మారింది. అక్కడ మద్యం సేవించడం వంటివి చేస్తున్నారు. మద్యం మత్తులో రిగ్‌కు బిగించిన వాల్స్ విప్పుతూ వికృత చేష్టలకు దిగుతున్నారని తెలిపారు. అక్కడే సిగరెట్లను సైతం కాలుస్తున్నారన్నారు. ఈ గ్యాస్ లీకైనా ఎలాంటి వాసన రాకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఈ రిగ్గు చుట్టూ ఫెన్సింగ్ ఉండేదని, ప్రస్తుతం అదికూడా లేదన్నారు.
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు...
ఈ గ్యాస్ రిగ్ వల్ల వస్తున్న ఆదాయంపై పెట్టిన దృష్టి, అధికారులు భద్రతపై పెట్టడం లేదు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని రోజూ భయపడుతున్నాం. మరో పాసర్లపూడి తరహా ప్రమాదం జరుగుతుందనే ఆందోళన అందరిలోనూ ఉంది. వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి.
- నల్లి వెంకటేశ్వరరావు, నెల్లివారిపేట
భయపడాల్సిన అవసరం లేదు
గ్రామస్తులు భయపడిన అవసరం లేదు. ఒఎన్‌జిసి ఉన్నత అధికారులతో మాట్లాడి ఫెన్సింగ్ ఏర్పాటు చేయిస్తాం. లీకులు లేకుండా అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తాం.
- కెవివి.రామ్‌ప్రసాద్, లీడింగ్ ఫైర్‌మెన్










