ప్రజాశక్తి- నెల్లిమర్ల : మండలంలోని గరికిపేట గ్రామానికి చెందిన మహంతి పాపాయ్యమ్మ (67) గ్యాస్ లీకై ఒంటికి మంటలు అంటుకోవడంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఈ నెల 17 ఆదివారం ఉదయం 5.30 గంటలకు నిద్ర లేచి టీ పెట్టేందుకు గ్యాస్ పొయ్యి వద్దకు వెళ్లింది. గ్యాస్ పొయ్యి ముట్టించడంతో అప్పటికే గ్యాస్ లీకై ఉండటం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి అమెకు అంటుకున్నాయి. దీంతో ఆమె పెద్దగా కేకలు వేసేసరికి ఇంట్లో నివసిస్తున్న తన కుమారుడు కృష్ణ లేచి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే ఆమె శరీరం కాలిపోవడంతో హుటాహుటిన చికిత్స నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ మూడు రోజులు చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజిహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. మృతురాలికి కుమారుడు కృష్ణ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










