Mar 04,2023 00:19

పొయ్యి మీద గ్యాస్‌ సిలిండర్‌ పెట్టి, ఖాళీ బండలతో నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు, గిరిజనులు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరలను తక్షణమే తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని కేశవరం గ్రామంలో కట్టెల పొయ్యి మీద గ్యాస్‌ సిలిండర్‌ పెట్టి, ఖాళీ సిలిండర్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. సామాన్యులపై భారాలు వేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకులు మేలిన రమేష్‌, మనుగుల రాజబాబు, లోతా శ్రీను, లోతా వెంకటలక్మి మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరగడంతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యులపై మోడీ ప్రభుత్వం వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్‌పై రూ.350 పెంచడం దారుణమన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో బిజెపి ప్రభుత్వం ప్రజలపై అమాంతంగా గ్యాస్‌ భారం మోపిందని విమర్శించారు. రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు గ్యాస్‌ ధరలు పెంచడం అన్యాయమన్నారు. మోడీ ప్రభుత్వం రాకముందు వంట గ్యాస్‌ బండ ధర రూ.417 ఉండగా, నేడు రూ.1150కు పెరిగిందని తెలిపారు. పెరిగిన ధర సబ్సిడీ రూపంలో ఇస్తామని తొలిత చెప్పిన మోడీ ప్రభుత్వం గత రెండేళ్ల నుండి సబ్సిడీ నిలిపివేసిందని విమర్శించారు. వాణిజ్య సిలిండర్‌ ధర పెంపు చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ, ప్రజలపై భారాలు మోపుతోందని ధ్వజమెత్తారు. కేంద్రం పెంచిన గ్యాస్‌ ధరలు తక్షణం ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు లోతా అర్జున్‌, మేలిన గంగ, ఎం.శివ, పి వెంకటరెడ్డి, మహిళలు పాల్గొన్నారు.