ప్రజాశక్తి-రేపల్లె: పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ స్థానిక నెహ్రూ బొమ్మ సెంటర్లో మోయలేని భారంగా గ్యాస్ బండ రేట్లు ఉన్నాయంటూ గ్యాస్ బండ మోస్తూ సీపీఎం నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిత్యావసర ధరలు తగ్గిస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు రోజువారి పేదలు తిండితినే వాటికి సంబంధించిన గ్యాస్ ధర పెంపుదల చేస్తు పేద ప్రజల పొట్టగొట్టి కార్పొరేట్ అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు కానుకగా ప్రధాని మోదీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారని విమర్శించారు. రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోగానే గ్యాస్ ధరలు పెంచడం కేంద్రానికి ఆనవాయితీగా మారిందని దుయ్యబట్టారు. బిజెపి అధికారంలోకి రాకముందు రూ.400 ఉన్న గ్యాస్ ధర ఇపుడు సుమారు రూ.1200కు చేరింది. సాధారణ గ్యాస్‌పై రూ.50, కమర్షియల్ గ్యాస్‌పై రూ.350 పెంపుదల చేయటం ద్వారా పేదలు తినే ఆహార పదార్థాల ధరలు పెద్దఎత్తున పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే జీఎస్టీ పేరుతో అన్ని రకాల ఆహార పదార్థాలు, పేదలు వాడే వస్తువుల మీద పన్నులు వసూలు చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ఈ కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల ముందు ధరలు అదుపు చేస్తామని ప్రకటన చేసి ఎన్నికలు అయిపోగానే ఇప్పుడు మరలా ధరలు పెంచుతుంది మోడీ మాటలు కేవలం ఎన్నికలో విజయాలు కోసమే అని పేదలపై ధరలు పెంపుదల చేయటం తన మిత్రులు అయినా రిలయన్స్ అంబానీ, అదాని లాంటివాళ్ల ఆస్తులు పెంపుద లకు సహకరిస్తున్నాడని విమర్శించారు. వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో సామాన్యులు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ విధానాలతో దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నదని, అసమానతలు, నిరు ద్యోగం పెరిగి సామాన్యుడి కొనుగోలు సామర్థ్యం అట్టడుగు స్థాయికి పడిపోయిందని అన్నారు. గ్యాస్‌బండ ప్రియం కావటంతో హౌటళ్లలో మెనూల ధరలు మారిపోయే అవకాశం ఉందన్నారు. రోడ్డు వెంట ఉండే సాధారణ బండి దుకాణం నుంచి స్టార్ హౌటళ్ల వరకు గ్యాస్ ధర పెంపు ప్రభావం పడనుందని పేర్కొన్నారు. పేదలు పై భారాలు వేస్తున్నా బిజెపి విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు గట్టిగా మాట్లాడకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం రేపల్లె వై కిషోర్ బాబు, జి దానియేలు డి బాబురావు, డి శ్రీనివాసరావు, ఎల్ వెంకట్, ఎం సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.










