Mar 03,2023 22:10

ప్రజాశక్తి-విజయవాడ 

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరలు, ఇతర భారాలకు వ్యతిరేకంగా సిపిఎం నిర్వహించే పోరాటాల్లోకి ప్రజలు కలిసి రావాలని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు పిలుపునిచ్చారు. పెంచిన గ్యాస్‌, పాల ధరలను రద్దు చేయాలని కృష్ణలంక 21వ డివిజన్‌ కల్పన ప్రింటర్స్‌ రోడ్డులో సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధర పెంచి గ్యాస్‌ బండ ప్రజల నెత్తినవేశారని, మరలా పుల్లల పొయ్యే గతి అన్నట్లు పుల్లలపొయ్యిమీద వంట చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పెంచిన గ్యాస్‌, పాల ధరలను రద్దు చేయాలని, భారాలు మోపుతున్న బిజెపి-మోడీ డౌన్‌ డౌన్‌ అంటూ నాయకులు, కార్యకర్తలు పెద్ద పెట్టు నినాదాలు చేశారు. కార్యక్రమానుద్దేశించి బాబూరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, భారాలకు వ్యతిరేకంగా సిపిఎం దేశ వ్యాప్తంగా ఈ నెల మొత్తం పెద్ద ఎత్తున ప్రచారాందోళన కార్యక్రమాలను నిర్వహిస్తుందని, వీటిల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయో లేదో వెంటనే గ్యాస్‌ ధరలను పెంచడం బిజెపి దివాళాకోరు పాలనకు నిదర్శనమని విమర్శించారు. పెరిగిన గ్యాస్‌ ధరల భారాలతో చిన్న చిన్న టిఫిన్‌ సెంటర్లు, టీ కొట్లు మూసుకునే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆదాయాలు పెరిగే చర్యలు మానుకొని, ప్రజల ఆర్థిక పరిస్థితులను దెబ్బతీసే విధంగా బిజెపి-మోడీ చర్యలు ఉంటున్నాయని ధ్వజమెత్తారు. ఇప్పటికే దేశ సంపదను ఆదాని, అంబానీలకు దోచిపెట్టారని అన్నారు. ప్రధాని మోడీ బాటలోనే సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నడుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలపై భారాలు మోపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాధ్‌ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు. సిపిఎం తూర్పు నగర కార్యదర్శివర్గ సభ్యులు పుప్పాల కృష్ణ, నాయకులు కోరాడ రమణ, శివాజి, లక్ష్మీనారాయణ, కుమార్‌, నాగరాజు, బి భారతి తదితరులు పాల్గొన్నారు.