ఉజ్వల గ్యాస్ సిలిండర్ ధరలో మరో రూ.వంద సబ్సిడీ ప్రకటించిన కేంద్రం
ఉమ్మడి జిల్లాలో 8.14 లక్షల గ్యాస్ కనెక్షన్లు
ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్‌దారులు 3,848 మందే
మిగిలిన లక్షలాది గ్యాస్ వినియోగదారుల పరిస్థితి ఏమిటని ప్రశ్న
గ్యాస్ ధర రూ.1100కు పెంచి రూ.200 తగ్గింపు ఎన్నికల జిమ్మిక్కే
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
కేంద్రంలోని మోడీ సర్కార్ మరోసారి ఎన్నికల జిమ్మిక్కులకు దిగింది. గడిచిన తొమ్మిదేళ్ల బిజెపి పాలనలో అందనంత ఎత్తుకి వంటగ్యాస్ సిలిండర్ ధరను పెంచి.. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రూ.వంద, రూ.200 తగ్గిస్తూ జనాన్ని మరోసారి మాయ చేసేందుకు పూనుకుంది. వంటగ్యాస్ ధర తగ్గింపుపై మోడీ సర్కార్ విన్యాసాలు చూస్తే ఇవంతా ఎన్నికల జిమ్మిక్కులని అర్థమవుతోంది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌దారులకు గతంలో రూ.200 సబ్సిడీ ప్రకటించిన కేంద్రం, బుధవారం కేంద్ర కేబినెట్‌లో మరో రూ.వంద తగ్గించి సిలిండర్‌కు రూ.300 సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన రూ.వంద సబ్సిడీ అందుకునే ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారుల సంఖ్య చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 12,90,004 వంటగ్యాస్ కనెక్షన్లు ఉండగా వీటిలో జనరల్ కనెక్షన్లు 8,14,847 ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దీపం కనెక్షన్లు 4,40,282, సిఎస్‌ఆర్ కనెక్షన్లు 29,468, ఐదు కిలోల గ్యాస్ కనెక్షన్లు 1,559 ఉన్నాయి. ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించిన ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్నవి కేవలం 3,848 మాత్రమే. ప్రస్తుతం గ్యాస్ వినియోగదారుల్లో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్న లబ్ధిదారులు నామమాత్రం. అంటే ప్రభుత్వం ప్రకటించిన రూ.వంద తగ్గింపు గ్యాస్ వినియోగదారులందరికీ వర్తించదు. దీంతో జిల్లాలో ఎనిమిది లక్షలకుపైగా గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ వర్తించదు. మోడీ అధికారంలోకొచ్చాక వంటగ్యాస్ సిలిండర్ ధరపై చేసిన మోసం పరిశీలిస్తే విస్తుపోక తప్పదు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చేసరికి 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.450 లోపే ఉంది. మోడీ వచ్చాక ఏడాదిలో నాలుగైదుసార్లు గ్యాస్ సిలిండర్ ధరను పెంచుకుంటూ వచ్చారు. దీంతో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1130కు చేరింది. వంటగ్యాస్ ధర పెంచడమే కాకుండా వినియోగదారుల ఖాతాల్లో వేసే సబ్సిడీ సొమ్మును సైతం కేంద్రం నిలిపివేసింది. దీంతో జనాలు మోడీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2024లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు మోడీ ఎన్నికల జిమ్మిక్కులకు తెర లేపారు. ముందుగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌దారులకు రూ.200 ధర తగ్గిస్తున్నట్లు ప్రకటించి తాజాగా మరో రూ.వంద తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం జనరల్ వంట గ్యాస్ కనెక్షన్‌దారులకు రూ.200 తగ్గించారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే రూ.1100కుపైగా గ్యాస్ సిలిండర్ ధర పెంచి రూ.200 తగ్గించి జనాలకు ఏదో మేలు చేస్తున్నట్లు కేంద్రంలోని మోడీ సర్కార్ గొప్పలు చెబుతుండటం విస్మయం కల్గిస్తోంది. ఇటీవల తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు పరిస్థితీ ఇదేవిధంగా ఉంది. బిల్లు ఇప్పుడు ఆమోదం పొందితే అమలు మాత్రం 2029 తర్వాతే అని చెప్పారు. అంటే వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే మోడీ సర్కార్ ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుందని స్పష్టమవుతోంది. వంటగ్యాస్ వినియోగదారులు మాత్రం మోడీ సర్కార్ మోసాన్ని ఇప్పటికే గ్రహించారు.










