Mar 02,2023 22:47

ప్రజాశక్తి - ఏలూరు
           పెంచిన గ్యాస్‌ ధర తగ్గించాలని కోరుతూ గ్యాస్‌ సిలెండర్‌ మోస్తూ సిపిఎం ఆధ్వర్యాన ఏలూరులో గురువారం వినూత్న నిరసన తెలిపారు. స్థానిక పాత బస్టాండ్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలని కోరుతూ గ్యాస్‌ సిలెండర్లను నెత్తిన పెట్టుకుని బండ భారం మోయలేక పోతున్నాం బాబోరు.. తగ్గించండి అంటూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి పళ్లెం కిషోర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ సిలెండర్‌ ధర రూ.50, వాణిజ్య సిలెండర్‌ ధర రూ.350 పెంచడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చే నాటికి గ్యాస్‌ సిలెండర్‌ ధర రూ.400 ఉంటే నేడు అది రూ.1155కు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్‌ ఛార్జీలూ ఇలానే పెంచారన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు రాయితీలు ఇస్తూ ప్రజలపై భారాలు వేస్తూ బిజెపి ప్రభుత్వం కాకులను కొట్టి గెద్దలకు పెట్టిన చందంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.సోమయ్య మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తవ్వగానే గ్యాస్‌ ధర పెంచిందని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు పివి.రామకృష్ణ, వి.సాయిబాబు, బి.జగన్నాథరావు, కె.రామాంజనేయులు, జి.రవికిషోర్‌, వివివివిఎన్‌.ప్రసాద్‌, వైఎస్‌.కనకారావు, మావూరి శ్రీనివాసరావు, కొర్రి విజయలక్ష్మి, జి.శారద, పి.రవికుమార్‌, ఎం.ఇస్సాక్‌, జి.యేసుబాబు, జి.కోటేశ్వరరావు, ఎస్‌.సత్యనారాయణ పాల్గొన్నారు.
న్యూడెమోక్రసీ ఆధ్వర్యాన
గ్యాస్‌ ధర విపరీతంగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం ఏలూరులో ర్యాలీ, ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. గ్యాస్‌ బండతో ప్రదర్శన నిర్వహించారు. ఫైరాఫీస్‌ సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు (యువి), జిల్లా నాయకులు బద్దా వెంకట్రావు, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు కె.నాని ప్రసంగించారు. కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు కాకర్ల అప్పారావు, యర్రా శ్రీనివాసరావు, డి.వీరినాయుడు, మంగం అప్పారావు, ఐఎఫ్‌టియు నాయకులు గడసాల రమణ, మేకల రామయ్య, రంగాల అప్పారావు, ఎస్‌.నాగేశ్వరరావు, కారణం శ్రీను, రాచీటి జాన్‌, ప్రసాద్‌, రామ్మూర్తి నాయుడు, కోరాడ అప్పారావు, బాపూజీ, దన్నాన విజరు పాల్గొన్నారు.
పెదపాడు: గ్యాస్‌ ధర పెంపును నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక బండ్ల తూము సెంటర్‌లో గురువారం నిరసన చేపట్టారు. గ్యాస్‌ సిలిండర్లను రోడ్డుపై పెట్టి పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలని నినదించారు. ఈ సందర్భంగా సిపిఎం నేత కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ గ్యాస్‌ ధర పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు లింగం కృష్ణారావు, గుండపనేని సురేష్‌, షేక్‌ కరీముల్లా, పిట్టా రాహుయేలు, రెడ్డి లక్ష్మణరావు, ముసునూరి కొండలరావు, షేక్‌ భాషా, షేక్‌ అహ్మదుల్లా పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం: పెంచిన గ్యాస్‌ ధర తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన ఎ.పోలవరంలో ఆందోళన నిర్వహించారు. యాగంటి సీత అధ్యక్షతన జరిగిన నిరసనలో సిపిఎం మండల కార్యదర్శి ఎం.జీవరత్నం మాట్లాడారు. ఓపక్క నిత్యావసరాల ధరలు పెరిగి సతమతమవుతుంటే మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా గ్యాస్‌ ధర పెంచడం దారుణమన్నారు. కార్యక్రమంలో నేతలు జి.సూర్యకిరణ్‌, బత్తుల వెంకన్న, టి.సోమాలమ్మ, డి.వెంకటేశ్వరరావు, పి.సూరయ్య, ఆర్‌.సత్యవతి, కె.రాములమ్మ, జ్వాలా వెంకటేష్‌, ఎ.కుమారి పాల్గొన్నారు.
కొయ్యలగూడెం: సిపిఎం ఆధ్వర్యాన తాడేపల్లిగూడెం రోడ్లో సుబ్రమణ్యం గుడి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి శుక్లబోయిన రాంబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డి.ధనరాజు, ఎస్‌.శివకుమార్‌, కె.సీతారాములు, సిహెచ్‌.మరిడియ్య, సిహెచ్‌.సత్యనారాయణ, అడపా నాని, పిల్లా తామారావు, కె.దుర్గారావు, జి.గోపీ, మిద్దె వెంకటేష్‌, ముప్పిడి సురేష్‌, టెక్కెం నాగు, రాసూరు దుర్గారావు, వంకాయ దుర్గారావు, వీర్రాజు, బి.రమేష్‌ పాల్గొన్నారు.
ఆగిరిపల్లి: పెంచిన గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం నేత సత్తు కోటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. గురువారం నాడు ఆగిరిపల్లి పెద్ద కొఠాయి సెంటర్‌ వద్ద గ్యాస్‌ ధర పెంపును వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావుతోపాటు రాజులపాటి చంటి మాట్లాడగా నేతలు షేక్‌ జహాంగీర్‌ భాషా, బండ కోటేశ్వరరావు, ఢిల్లీ నాగరాజు, నల్లమోతు రమేష్‌, పలువురు మహిళలు పాల్గొన్నారు.