Mar 03,2023 22:25

సిలెండర్లు రోడ్డుపై పెట్టి.. గరిటెలతో వాయిస్తూ..
ఐద్వా ఆధ్వర్యాన మహిళలు వినూత్న నిరసన
ప్రజాశక్తి - ఏలూరు 

              పెంచిన గ్యాస్‌ ధర తగ్గించాలని ఐద్వా ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్‌ గానుగలపేటలో మహిళలు ఇళ్లలోని గ్యాస్‌ సిలెండర్లు రోడ్డుపై పెట్టి గరిటెలతో వాయిస్తూ వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కన్వీనర్‌ పి.హైమావతి మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక గ్యాస్‌ సిలెండర్‌ ధర రూ.400 నుండి రూ.1200కు పెంచిందని, ఫలితంగా కట్టెల పొయ్యికి వెళ్తే మహిళల కంట కన్నీళొస్తున్నాయని వాపోయారు. పెంచిన గ్యాస్‌ ధర తక్షణం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలవ్వగానే బిజెపి గ్యాస్‌ ధర పెంచిందని విమర్శించారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఇందిర, రాజేశ్వరి, ఉషారాణి, వెంకటరమణ, శైదాని, జి.లక్ష్మిశారద, సారికి చిన్నమ్మ, సరికి కోమల, నడుపూరి పద్మ, మోటూరి జయశ్రీ, సిఐటియు నాయకులు జె.గోపీ, జాన్‌బాబు పాల్గొన్నారు.